అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఎట్టకేలకు ఖరారైంది. గురువారం ఉదయం జిల్లా పరిషత్ డిపిసి హాలులో ఈ సమావేశం జరుగనుంది. సెప్టంబర్‌తో ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న సమయంలో ఈ సమావేశం జరుగనుంది. సాధారణం ఆగస్టు మొదటి వారంలోనే ఈ సమావేశం నిర్వహించేవారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే నీటి కేటాయింపులు జరుగుతాయి. కాని ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగు, తాగునీటి కష్టాలు అధికంగానే ఉన్నాయి. అయితే తుంగభద్ర డ్యామ్‌కూ నీరు ఆలస్యంగా రావడంతో నీటి విడుదల్లోనూ కొంత జాప్యం జరిగింది. ఇక ఐఎబి సమావేశం కూడా ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న సమయంలో జరుగుతుండటం గమనార్హం.
ఆయకట్టు రైతులకు తప్పని ఇబ్బందులు
ఆయకట్టు రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ కిందనున్న ఆయకట్టే నీరందక నార ముదిరిపోయి పంట వేసుకోలేని పరిస్థితి నెలకొంది. గుంతకల్లు బ్రాంచ్ కాలువ కింద ఇదే పరిస్థితి నెలకొంది. డిస్ట్రిబ్యూటరీలకు పూర్తి స్థాయి నీరు లేక వరి పంటకు నీరందటం లేదు. ఇక మిడ్ పెన్నార్ దక్షిణ కాలువకు నీరు ఎప్పుడు అందుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. హంద్రీనీవా రైతుల పరిస్థితి అయోమయంగానే ఉంది. శ్రీశైలం డ్యామ్‌కు పుష్కలంగా నీరు రాలేదు. ఎప్పుడు వస్తాయో ఎప్పుడూ నీరు ఆగిపోతుందో తెలియక ఆయకట్టు రైతులు పంటలు సాగు చేసుకోవాలో లేదో తెలియకుండా ఉంది. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు ఆయక్టుకు నీరందని పరిస్థితి నెలకొన్నాయి.
కాలువలు ఎక్కడి పరిస్థితి అక్కడే
తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పరిస్థితి దయనీయంగా మారింది. ఆధునీకరణ పనులు మధ్యలో ఆపివేసియున్నారు. నాలుగేళ్లుగా కనీసం నిర్వహణ కూడా నోచుకోలేదు. ఎప్పుడు గండిపడుతుందోనన్న గుబులు అధికారుల్లో ఉంది. ఈ ఏడాది వరుసగా మూడుసార్లు కాలువకు గండిపడింది. అసలే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఈ సమయంలోనూ పూర్తి స్థాయిలో నీటిని తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది పుష్కలంగా నీరొచ్చినా నిలువ చేసుకునే సామర్థ్యం లేక వృథాగా నదిలోకి వంద టిఎంసిల వరకు వెళ్లింది. ఇక హంద్రీనీవా ఆధునీకరణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. గత ఐఎబి సమావేశాల్లో ఈ అంశాలపై నేతలు చర్చించారు. ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కాని ఇప్పటికీ పనులు ప్రారంభమవలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. ప్రతి సమావేశంలోనూ నేతలు ప్రాంతాల వారీగా విడిపోయి నీటి కోసం వాదనలు చేసుకోవడం మినహా శాశ్వత పరిష్కారానికి తీసుకున్న చర్యలేవి ఉండటం లేదు.










