ప్రజాశక్తి - ఆదోని
ఆస్తి పంపకాల్లో అన్యాయం జరుగుతోందని స్పందనలో ఎస్పీ కృష్ణకాంత్‌ను ఆశ్రయించినా న్యాయం జరగలేదని దళిత మహిళ వాపోయారు. శనివారం దళిత మహిళ సంతోషి మాట్లాడారు. కోసిగి గ్రామానికి తనకు ఆదోని మండలం నెట్టేకల్లు గ్రామానికి చెందిన చంద్రతో 2014లో వివాహమైందని తెలిపారు. 2017లో కోసిగి పెట్రోల్ బంకు వద్ద బైకులు ఢకొీన్న ప్రమాదంలో తన భర్త చంద్ర మృతి చెందారన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అప్పటి ప్రభుత్వం రూ.5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిందని తెలిపారు. మట్టి ఖర్చుల పేరుతో తన భర్త తండ్రి సుంకన్న మాయమాటలు చెప్పి రూ.5 లక్షలను తీసుకున్నారన్నారు. ఇప్పటివరకు మిగిలిన డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. తన భర్తకు రావాల్సిన ఆస్తి పంపకాల్లో రెండెకరాల భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఏడేళ్లుగా తిరుగుతున్నా కనీసం తనను పట్టించుకోవడం లేదన్నారు. భర్త ఊళ్లో ఉందామంటే అక్కడ సూటిపోటి మాటలతో తనను కించపరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. పుట్టినిల్లు కోసిగిలోనే తన తల్లిదండ్రులు నరసమ్మ, బర్మప్ప వద్ద తన కుమార్తెతో ఉంటూ కూలి పని చేసుకుని జీవిస్తున్నానని తెలిపారు. ఆస్తిలో భాగం ఇవ్వాలని కోరుతుంటే 'నీకెందుకు' అంటూ అత్తమామలు పట్టించుకోవడం లేదని వాపోయారు. తన కుమార్తె భవిష్యత్తు ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సంఘం నాయకుల సహకారంతో ఈనెల 7న ఎస్పీని సంప్రదించి స్పందనలో అర్జీ ఇచ్చామని తెలిపారు. అక్కడి నుంచి ఆదోని డీఎస్పీ కార్యాలయంలో కలిశామన్నారు. ఆదోని తాలూకా పోలీసు స్టేషన్‌కు వెళ్లాలని సూచించడంతో వారిని సంప్రదించామని తెలిపారు. ఏడు రోజులుగా తిప్పుకుంటున్నారే కానీ ఇరువురిని పిలిచి సమస్య పరిష్కరించలేదన్నారు. ఎస్పీ సిఫార్సునే పోలీసులు నిర్లక్ష్యం చేయడం ఏమిటని దళిత సంఘం నాయకులు లోకేష్ ప్రశ్నించారు. దళిత మహిళ సంతోషికి న్యాయం చేయాలని, లేకపోతే మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవసరమైతే హోంమంత్రిని కలుస్తామని హెచ్చరించారు.
న్యాయం చేయాలని కోరుతున్న దళిత వితంతు మహిళ










