Sep 30,2023 01:08

ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలల వసతి గృహాలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు కే.ప్రభుదాస్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జీవన్‌ కృష్ణ, చిన్నారావు తెలిపారు. ఎస్టీ హాస్టల్స్‌ లో సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అల్లూరి జిల్లాలో చలో కలెక్టరేట్‌లో భాగంగా ఐటీడీఏ ఎదుట విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్స్‌ లో సౌకర్యాలు మెరుగు పరచాలని కోరుతూ ఏపీవోను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, జిల్లాలో ఆశ్రమ, కస్తూర్బా, ఏకలవ్య, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, వసతి గృహాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో విద్యార్థులకు మాత్రం కనీస వసతులు లేవని తెలిపారు. మెనూ కూడా పూర్తిగా సక్రమంగా అమలు కాలేదని ఆరోపించారు. వసతి గీహాలు సరిపోక పోవడం, అరకొరగా మరుగుదొడ్లు, రన్నింగ్‌ వాటర్‌ సప్లై సక్రమంగా లేకపోవడం, ఆహారంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ప్రభుత్వం హెల్త్‌ వాలంటీర్లను తొలగించడంతో విద్యార్థులు అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా అవస్థలు పడుతున్నారని సకాలంలో వైద్యం అందని పరిస్థితి నెలకొంటుందన్నారు. దీంతో విద్యార్థుల మరణాలు కూడా సంభవి స్తున్నాయని చెప్పారు. జూనియర్‌, కస్తూర్బా ఏకలవ్య పాఠశాల కళాశాలలో పూర్తిస్థాయిగా ఉపాధ్యాయులు, లెక్చరర్స్‌ లేకపోవడంతో బోధన కుంటుపడిందని తెలిపారు. ఈ కారణంగా అనేక మంది విద్యార్థులు డ్రాప్‌ అవుట్‌ అవుతున్నారని, ఈ విషయం పట్ల సంబంధిత అధికారులు స్పందించి పోస్టులను భర్తీ చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్‌ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిన్నారావు, జీవన్‌ కృష్ణ, జిల్లా కమిటీ నాయకులు నరేష్‌, మత్స్యరాజు, కార్తీక్‌, సింహాద్రి, విద్యార్థులు పాల్గొన్నారు.