ప్రజాశక్తి-సాలూరు రూరల్ : మండలంలో బాగువలసలో సుతాపల్లి నగేష్‌కు చెందిన అనధికార ఎరువుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. చాలా రోజుల నుండి అనధికారికంగా సుతాపల్లి నగేష్ అనే వ్యక్తి ఎరువులు , పురుగు మందులను బయట నుండి తీసుకువచ్చి బాగువలస పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ సిఐ సింహాచలం తన సిబ్బందితో కలిసి శుక్రవారం బాగువలసలో నగేష్ షాప్‌నకు వచ్చారు. అప్పటికే విజిలెన్స్ అధికారులు వచ్చినట్లు తెలుసుకున్న నగేష్ షాప్ మూసేసి తప్పించుకున్నాడు. విజిలెన్స్ అధికారులు నగేష్ భార్యను పిలిపించి ఎరువులున్న షాప్‌నకు తాళాలు వేశారు. సోమవారం మళ్లీ వచ్చి తనిఖీలు చేస్తామని చెప్పారు. వారు అనుకున్నట్లే సోమవారం మండల వ్యవసాయ అధికారులతో కలిసి బాగువలస చేరుకొని షాపును తెరిచారు. ఆ షాప్‌లో సుమారు 77 యూరియా, 10 డిఎపి, 17 ఎంఒపి, 3 భూ అషుద్, 20 మెగా పవర్, 2 స్వర్ణ సూపర్ బస్తాలున్నాయి. వాటి విలువ రూ.1.71 లక్షలుగా నిర్ధారించారు. అనధికారికంగా అమ్మకాలు సాగిస్తున్న సుతాపల్లి నగేష్‌పై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇంఛార్జి వ్యవసాయ అధికారి మధుసూదనరావు, ఎఇఒ శ్రీనివాసరావు పాల్గొన్నారు.










