Sep 16,2023 21:41

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు లోకనాధం, వేదికపై నాయకులు సుబ్బరావమ్మ, రెడ్డి వేణు తదితరులు

ప్రజాశక్తి - కురుపాం : రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులను గిరిజనులు పొందాలంటే ఎర్రజెండాతోనే సాధ్యమని కోరన్న, మంగన్న స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని గిరిజనులంతా ఏకతాటిపైకి వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడ్డానికి సిద్ధంగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం, కె.సుబ్బారావమ్మ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సిపిఎం నాయకులు మండగి రమణ అధ్యక్షతన జరిగిన కురుపాం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు. నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెరిగి సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయ న్నారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ 9ఏళ్లలో ఉన్న ఉద్యోగాలు పీకేశారు తప్ప ఎక్కడా ఉద్యోగాలు వేసే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా, పోర్టులు, రోడ్లుతో పాటు మైనింగ్‌, గనులు కార్పొరేట్‌, పెట్టుబడుదారులకు కారుచౌకగా అమ్మేస్తూ దేశ సంప దంతా మోడీ ప్రభుత్వం కొల్లగొడుతుందని అన్నారు.బిజెపి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మన రాష్ట్రంలోని అన్ని పార్టీలు పూర్తి మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆపాలని, ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 20న విశాఖలో ఉత్తరాంధ్రలో బైక్‌ ర్యాలీ ప్రారంభమై 29 వరకు కొనసాగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఉక్కు రక్షణపై బైక్‌ ర్యాలీని జయప్రదం చేయండి
ఉక్కు రక్షణయాత్ర ఉత్తరాంధ్ర బైక్‌ ర్యాలీ పోస్టర్‌ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బరామ్మ ,జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, కె.గంగు నాయుడు, కె.అవినాష్‌, ఇందిర, నాయకులు ఎం.రమణ, ఎం.శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఉత్తరాంధ్ర బైక్‌ యాత్ర ఈనెల 24, 25 తేదీల్లో కురుపాం, సాలూరు, పార్వతీపురం పాలకొండ నియోజక వర్గాల్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రాల్లో సభలు జరుగుతాయి. ఈ సభలకు స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం పోరాడే శక్తులన్నీ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి, జిల్లా వై.మన్మధరావు, నియోజకవర్గంలో గల ఐదు మండలాల సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.