Sep 10,2023 21:56

మినాక్షికి ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇస్తూ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు

ప్రజాశక్తి - సాలూరు : స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పోస్ట్‌ కోసం తెరవెనుక పైరవీలు మొదలయ్యాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా మార్చడంతో పాటు వందపడకల ఆసుపత్రిగా అప్‌ గ్రేడ్‌ చేశారు. దీంతో ఆసుపత్రి బాస్‌ పదవి కోసం పోటీ పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో ఐదుగురు సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌లు పని చేస్తున్నారు. వీరిందరికన్నా సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ అయిన డాక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ మొన్నటి వరకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పని చేశారు. పని ఒత్తిడి, అనారోగ్యం కారణంగా ఆయన సూపరింటెండెంట్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన తర్వాత సీనియర్‌ అయిన డాక్టర్‌ ఎ.రత్నకుమారి ఇప్పుడు ఇంఛార్జి సూపరింటెండెంట్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇదే ఆసుపత్రి లో పని చేస్తున్న డాక్టర్‌ వి ఆర్‌ మీనాక్షిని ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నియమిస్తూ సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సిఎం రాజన్నదొర కొనసాగుతున్నారు. వాస్తవంగా చూస్తే ఆసుపత్రి లో పని చేస్తున్న ఐదుగురు సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ల్లో డాక్టర్‌ మీనాక్షి ఆఖరులో ఉన్నారు. డాక్టర్‌ వేణుగోపాల్‌ తర్వాత సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌గా డాక్టర్‌ రత్నకుమారి ఉన్నారు. ఆమెను కాదని జూనియర్‌ అయిన డాక్టర్‌ మీనాక్షిని ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.డాక్టర్‌ మీనాక్షి కన్నా ముగ్గురు సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌లు సీనియర్లుగా ఉన్నారు. వారందర్నీ పక్కన పెట్టి డాక్టర్‌ మీనాక్షికి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నియమించడాన్ని సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ లు అసంతప్తితో ఉన్నారు. సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ల జాబితా కూడా రాజన్నదొరకు చేరింది. జూనియర్‌ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ స్పెషలిస్ట్‌గా డాక్టర్‌ మీనాక్షిని సూపరింటెండెంట్‌గా నియమిస్తూ వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు చేయడంపై రాజన్నదొర ఆగ్రహంతో ఉన్నారు.
వైద్య, ఆరోగ్య మంత్రి కి లేఖ రాస్తా : డిప్యూటీ సీఎం రాజన్నదొర
ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నియామకం విషయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జారీ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు నా దష్టి కి వచ్చింది. డాక్టర్‌ వేణుగోపాల్‌ అనారోగ్యం కారణంగా సూపరింటెండెంట్‌ బాధ్యతలు నిర్వహించేందుకు అయిష్టత వ్యక్తం చేశారు .అయితే ఆయన తర్వాత సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌లు ముగ్గురు ఉన్నారు. వారిని కాదని జూనియర్‌ అయిన డాక్టర్‌ మీనాక్షిని ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు రావడం ఆశ్చర్యంగా ఉంది. ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి, ఆశాఖ ఉన్నతాధికారులకు సీనియర్‌ ఎవరో తేల్చాలని కోరుతూ లేఖ రాస్తాను.