Oct 05,2023 21:36

పాలకొండ : సిడిపిఒకు వినతిని అందజేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి - సాలూరు : అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు పోషకాహారం పంపిణీ సమయంలో ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ గురువారం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు కార్యాలయంలో సిడిపిఒ బి.సత్యవతికి యూనియన్‌ అధ్యక్షులు బి.రాధ, సెక్టార్‌ నాయకులు శ్యామల, నారాయణమ్మ, శశికళ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 1నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం కిట్లు పంపిణీ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్లు సరిగ్గా పనిచేయకపోవడంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు కావడం లేదన్నారు. దీనివల్ల బాలింతలు, గర్భిణులను పదేపదే కేంద్రాలకు రప్పించే పరిస్థితి తలెత్తుతుందని తెలిపారు. దీని నివారణకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
పాలకొండ : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు అమలు చేస్తున్న ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను రద్దు చేయాలని అంగన్వాడీ ఐసిడిఎస్‌ పిఒకు వినతి పత్రం అందజేశారు. గర్భిణీలకు, బాలింతలకు ఆహారం ఇచ్చే సమయాల్లో యాప్‌లో నమోదు చేయమనడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఫోన్లు పనిచేయకపోవడం, సిగల్స్‌ లేకపోవడం వల్ల డౌన్లోడ్‌ చేయలేకపోతున్నామని అన్నారు. ఈ వినతి పత్రం అందించిన వారిలో అధ్యక్షులు జెసి భారు, కార్యదర్శి బి.అమరవేణి, శారద, తదితులున్నారు.