ప్రజాశక్తి - తనకల్లు : రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో స్థానిక స్టేట్ బ్యాంక్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రైతుసంఘం నాయకులు వివి రమణ, మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రైతులకు సరైన సహకారం అందించడం లేదన్నారు. రైతులు తమ భూములను బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నారని అయితే బ్యాంకులు రైతులకు రుణాలు అందించడంలో నిర్లక్ష్య వహిస్తున్నాయన్నారు. ఎంతో విలువైన భూములకు తక్కువ మొత్తంలో రుణాలు అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న భూమి ధరలను అంచనా వేసి ప్రతి రైతుకు ఎకరానికి 50వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు పంట రుణాలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం తీసుకున్న పట్టాదారు పాస్ పుస్తకాలకు కొత్త రుణాలు ఇంతవరకు మంజూరు చేయలేదని, బ్యాంకు అధికారులను అడిగితే తమకు తెలియదని తప్పించుకుంటున్నారని విమర్శించారు. బ్యాంకు సేవలను వినియోగించుకోవడానికి బ్యాంకుకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా ఎస్‌బి అకౌంట్ నందు లావాదేవీలు నిర్వహించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బ్యాంకు మేనేజర్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీరైతు సంఘం మండల నాయకులు ఎం. శివన్న, వెంకటరమణ, చలపతి ఓ.వేమన్న, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.










