ప్రజాశక్తి - కురుపాం : ఏనుగుల వల్ల ధ్వంసమైన పంటలకు, ఇళ్లకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి జిల్లాలో రెండు ఏనుగుల గుంపులను జూకు తరలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మండలంలోని తిత్తిరి పంచాయతీలో గల తిత్తిరి, మర్రిమానుగూడ తదితర గిరి శిఖర గ్రామాల్లో ఏనుగుల వల్ల పంటలు, ఇళ్లు నష్టపోయిన బాధిత గిరిజన రైతులతో కలిసి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా దాదాపు తిత్తిరి పంచాయితీ పరిధిలోగల 200 ఎకరాలకు పైగా గంటిచేను, రాగులు, వరి పంటలను ధ్వంసం చేశాయని, అలాగే నాలుగు పూరి, రేకు ఇళ్లను కూడా పూర్తిగా ధ్వంసం చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కనీసం అధికారులు ఇప్పటికీ గ్రామానికి వచ్చి బాధితుల పేర్లు నమోదు చేసి వారికి నష్టపరిహారం గురించి మాట్లాడకపోవడం దుర్మార్గ మని అన్నారు. ఇప్పటికైనా పంట నష్టాలను గుర్తించి ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించి ఇంతకుముందు పంట నష్టపోయిన కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి తదితర మండలాల్లో రైతులకు బకాయి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 11 మంది వరకు ఏనుగుల దాడిలో చనిపోయినా వీటి తరలింపునకు ప్రత్యామ్నాయ చర్యలకు పాలకులు, అటవీ అధికారులు పట్టించు కోకపోవడం శోచనీయమని అన్నారు. జియ్యమ్మ వలస, భామిని, సీతంపేట, తదితర గిరిజన ప్రాంతాల్లో ఏనుగులు రోడ్లు పైకి వచ్చి వాహనాలు, మనుషులు, పశువుల పై పడి దాడి చేస్తూ ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం చేస్తున్నా యని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి జిల్లాలో నష్టపోయిన పంటలను అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని ఇప్పటికే గ్రామాల్లో సంతకాల సేకరణ, ఆందోళన కార్యక్రమం చేపట్టామన్నారు. తక్షణమే అధికారులు స్పందించక పోతే డిఎఫ్‌ఒ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, గిరిజన గ్రామల రైతులు హిమరక తాబు, రామలక్ష్మణ్, తిరుపతిరావు, రాము, రోజా, జయంతి, జుమ్మా, బిడ్డకి జోషి పాల్గొన్నారు.










