గుమ్మలక్ష్మీపురం: అడవి ఏనుగుల సంచారంతో రైతులు, ప్రజలే కాదు విద్యార్థులకు కూడా భయాందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. అడవిలో ఉండాల్సిన ఏనుగులు జనసంచారం లోకి వచ్చి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ పంట పొలాలు, వ్యవసాయ బోర్లను నాశనం చేసిన అడవి ఏనుగుల గుంపు ఏకంగా పాఠశాలపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశాయి. వివరాల్లోకి వెళితే జియ్యమ్మవలస రామినాయుడువలసలో అడవి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి సమీపంలో ఉన్న శ్రీ సత్యకైలాస్ ప్రైవేట్ పాఠశాలపై బుధవారం రాత్రి దాడి చేశాయి. పాఠశాలలో ఉన్న కిటికీలు, రేకులు, బెంచీలతో పాటు పాఠశాల ఆవరణంలో ఉన్న సరస్వతిదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశాయి. రాత్రి వేళ కావడంతో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే అడవి ఏనుగులు రామి నాయుడువలస సమీపంలో ఉన్న చెరువులో తిష్టవేసి ఉన్నాయని, తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు అటవీశాఖ అధికారులకు బుధవారం విన్నవించుకున్నారు. ఆ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించే చర్యలు తీసుకోకపోవడంతో పాఠశాలపై దాడి చేశాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల కిందట పెదకుదమలో ఉన్న అంగన్వాడీ కేంద్రంపై దాడి చేసి తలుపులు, కిటికీలు విరగొట్టాయి. నిత్యవసర సరుకులు ధ్వంసం చేశాయి. కొమరాడ మండలంలో కిరాణా షాపుపై దాడి చేసి ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతున్నా ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గిరిజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.










