Sep 21,2023 19:06

ప్రజాశక్తి - చాట్రాయి
   ఎన్నికల బూత్‌ను ప్రాథమిక పాఠశాలలో కాకుండా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలని చిన్నంపేట గ్రామస్తులు గురువారం తహశీల్దార్‌కు వినతిని సమర్పించారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనరల్‌, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిసారి ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రాథమిక పాఠశాలలో ఓటింగ్‌ వేయటానికి వెళ్లిన ఓటర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని స్థానిక చిన్నంపేట గ్రామస్తులు కొమ్ము సుజాన రావు, కొమ్ము ఆనందం తహశీల్దార్‌ సిహెచ్‌.విశ్వనాథరావుకు వినతిని సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలోని చిన్నంపేట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఆ పాఠశాలలో ఓటర్లు నిలబడటానికి స్థలము లేకపోవటం, ఒకే పాఠశాలలో నిర్వహించడం వలన ఓటర్లు తమ ఎన్నికల బూత్‌ నెంబరు తెలియక గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. ఈసారి ఎన్నికల బూత్‌ ప్రాథమిక పాఠశాలలో కాకుండా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలని, ఆ పాఠశాలలో విశాలమైన స్థలము ఉండటం వలన ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని కోరారు.