ప్రజాశక్తి-ఆలూరు
వర్గమేదైనా తల్లిదండ్రులు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఏ చిన్న బాధ వచ్చినా తల్లడిల్లిపోతారు. రైతులు కూడా పంటలను బిడ్డల్లాగే కాపాడుకుంటారు. దుక్కి దున్ని, విత్తు వేసినప్పటి నుంచి పంట రోగాలబారిన పడకుండా చూసుకుంటారు. ప్రస్తుతం వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయి. రైతు పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరీ కష్టపడుతున్నాడు. ట్యాంకర్ల ద్వారా పంటకు నీటిని అందిస్తున్నాడు.
జిల్లా పశ్చిమ ప్రాంత పట్టణ, గ్రామాల్లో ఏ రైతును పలకరించినా ఈ కష్టాలు కంటబడతాయి. ఆలూరు నియోజకవర్గంలో జూన్ నెలలో కురిసిన వర్షాలకు రైతులు పత్తి, మిరప, వేరుశనగ, జొన్న, ఆముదం పంటలను సాగు చేశారు. నియోజకవర్గంలో దేవనకొండ మినహా ఐదు మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1,74,167.5 ఎకరాల్లో పంట సాగు చేశారు. ప్రధానంగా పత్తి 94,602.5 ఎకరాలు, మిరప 44,900 ఎకరాలు, ఉల్లి 3,940 ఎకరాలు, వేరుశనగ 3,222.5 ఎకరాలు, కంది 13,707.5 ఎకరాల్లో సాగు చేశారు. ఆగస్టు నెల నుంచి వర్షం కురవకపోవడతో పంటలు ఎండుముఖం పట్టాయి. మిరప పంటకు రూ.లక్షల పెట్టుబడి పెట్టి ఎండిపోతున్న తరుణంలో రైతు చూడలేక పంటను బతికించేందుకు నీటి ట్యాంకర్లతో పంటను తడుపుతున్నాడు.
కురవని వర్షం.. - కనికరించని ప్రభుత్వం...
నియోజకవర్గంలో ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి, హోళగుంద మండలంలో మిరప పంటను కాపాడుకొనేందుకు రూ.లక్షలు ఖర్చు పెట్టి నీటి ట్యాంకర్లతో నీరందిస్తున్నారు. జూన్‌లో కురిసిన వర్షాలకు రైతులు విత్తనం వేసుకోగా ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు వర్షం కురవలేదు. ఒక్క నియోజకవర్గమే కాక జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉందని రైతులు, రైతు సంఘాల నాయకులు తెలుపుతున్నారు. ప్రభుత్వం మాత్రం రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ మాయమాటలు చెబుతోందని వామపక్షాలు, రైతు సంఘాల నాయకులు, రైతులు విమర్శిస్తున్నారు. జిల్లాను కరువుగా ప్రకటించి తక్షణమే రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆందోళనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ప్రభుత్వం రైతులపై కనికరం లేకుండా మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను
- చిన్న రంగన్న, రైతు, మనేకుర్తి
4 ఎకరాల్లో మిరప పంటను సాగు చేశాను. జూన్‌లో కురిసిన వర్షానికి నీటి కుంటలో నీరు నిల్వ ఉండడంతో ఆగస్టు చివరి వరకు ఆ నీటితో ఆయిల్ పంపుతో మిరప పంటను బతికించుకున్నాను. నీరు లేకపోవడంతో ఎండుముఖం పట్టింది. పంటను బతికించుకొనేందుకు తప్పని పరిస్థితిలో అప్పు చేసి 100 నీటి ట్యాంకర్లతో ప్రస్తుతం పంటకు నీటిని అందించాం. ఇలాగే వర్షం రాకపోతే పెట్టుబడి పెట్టలేక అప్పులపాలు కావాల్సిందే.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
- ఈరన్న, రైతుసంఘం మండల కార్యదర్శి, ఆలూరు
ఖరీఫ్, రబీ సీజన్‌లో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో తోచక దిగాలు చెందుతున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. లేకపోతే రైతుల ఆత్మహత్యకు దారి తీస్తుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రైతుల ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది.
ట్యాంకర్‌తో నీటిని పడుతున్న రైతు










