రాయదుర్గం రూరల్ : వరుణుడిపై ఆధారపడి, భూమిని నమ్ముకుని వ్యవసాయం ద్వారా పంట పండిస్తామని కోటి ఆశలతో ఎదురు చూసే రైతులకు ఈ ఖరీఫ్ కూడా తీరని నష్టాన్నే మిగిల్చింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది లోటు వర్షపాతంతో వ్యవసాయ రంగం కుదేలైంది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక రైతులు మరింత ఇబ్బందుల్లో పడ్డారు. అదునులో వర్షాలు రాక, సాగు చేసిన అరకొర పంటలు కూడా మండుతున్న ఎండలకు వాడిపోతున్నాయి. రాయదుర్గం డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు గాను వేరుశనగ సాధారణ విస్తీర్ణం 41,884 హెక్టార్లు కాగా ఈ ఏడాది 34,727 హెక్టార్లు సాగు అయినట్లు తెలుస్తోంది. సుమారు 7157 హెక్టార్ల మేర వేరుశనగ సాగు తగ్గింది. ఖరీఫ్ సీజన్లో జూన్ 15 నుంచి జూలై 30వ తేదీ వరకు మాత్రమే వేరుశనగ సాగు చేసేందుకు అనువైన సమయంగా ఉంటుంది. వర్షభావ పరిస్థితుల దష్ట్యా ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడితో, 90 రోజుల్లో చేతికందే ఆముదం, పత్తి, కంది, కొర్రలు లాంటి పంటలను రైతులు సాగు చేశారు. గుమ్మగట్టలో 12,006 హెక్టార్లు వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం కాగా 11,686 హెక్టార్లలో సాగు అయ్యింది. రాయదుర్గం మండలంలో 14,596 హెక్టార్లు కుగాను 11786 హెక్టార్లు, డి హీరేహాల్ 5877 హెక్టార్లకు గాను 5106 హెక్టార్లు, కనేకల్ 7448 హెక్టార్లకు గాను 4759 హెక్టార్లు, బొమ్మనహాల్‌లో 1957 హెక్టార్లకు గాను1390 హెక్టార్లలో సాగు జరిగింది. జూన్, జులై నెలలో కాస్త వర్షాలు పడ్డప్పటికీ ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు వచ్చేపాటికి లోటు వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో వేరుశనగ సాగు పూర్తిగా తగ్గింది. సాగు చేసిన అరకొర పంట కూడా ఎండదశకు చేరుకుంది. పంట చేతికందని పరిస్థితుల్లో కనీసం పశువులకు మేత అయినా సమకూర్చుకోలేని దైన్యస్థితిలో రైతాంగం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల దష్ట్యా రాబోవు రోజుల్లో అన్ని రంగాల వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడనుందని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునే చర్యలను చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.










