Aug 22,2023 19:45

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

ప్రజాశక్తి - హోళగుంద
విద్యుత్‌ సక్రమంగా లేక నీరందక పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోయారు. మంగళవారం రైతులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు సింధువాళ్లం కృష్ణ, ఉపాధ్యక్షులు కాకి సీతప్ప మాట్లాడారు. మండలంలో విద్యుత్‌ అధికారులు బోరుబావులకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారని తెలిపారు. రైతులకు ఆత్మహత్య శరణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో వారంలో మూడు రోజులు రాత్రి, పగలు తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధించడంతో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచారని చెప్పారు. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని విమర్శించారు. రాత్రి సమయంలో చిన్న పిల్లలు, వృద్ధులు దోమల కాటుకు గురై ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. రైతులు పండించిన పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్‌కు అంతరాయం కలిగితే రైతులకు ఆత్మహత్యలే శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.