Sep 01,2023 19:56

రైతులతో కలిసి ఆందోళన చేస్తున్న రామకృష్ణ

ప్రజాశక్తి - దేవనకొండ
ప్రభుత్వ, విద్యుత్‌ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ తెలిపారు. శుక్రవారం కర్నూలు - బళ్లారి రహదారిపై ఈదుల దేవరబండ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ముందు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. పంటలకు సరిపడే విద్యుత్‌ సరఫరా చేయాలని, రైతుల పట్ల ప్రభుత్వ, విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని రైతులు నినాదాలు చేశారు. ప్రయాణికులకు కొంత అసౌకర్యమైనప్పటికీ రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ సంఘీభావం తెలిపి మాట్లాడారు. వైసిపి రైతుల ప్రభుత్వమని గొప్పలు చెబుతూ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని కనీసం గంట, రెండు గంటలు కూడా నిలకడగా విద్యుత్‌ సరఫరా చేయకపోవడం దారుణమన్నారు. స్థానిక విద్యుత్‌ శాఖ అధికారులు బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రైతులు పదేపదే అధికారులకు విన్నవించినా విద్యుత్‌ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరా ఇవ్వాలని కోరారు.