Sep 15,2023 21:22

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
          ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలను వర్చువల్‌ విధానంలో సిఎం జగన్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. విజయనగరం జిల్లా గాజులరేగలో వైద్య కళాశాలను ప్రారంభించి అక్కడి నుంచే ఏలూరుతోపాటు మరో మూడు మెడికల్‌ కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యార్థులంతా గొప్ప డాక్టర్లు కావాలని, ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని ఈ దృష్ట్యా మరో 17 వైద్య కళాశాలలను చేర్చి 28 మెడికల్‌ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గపరిధిలో ఓ మెడికల్‌ కాలేజీ ఉండబోతుందన్నారు. ప్రస్తుతం ఐదు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించుకున్నామని వచ్చే ఏడాది మరో ఐదు ప్రారంభిస్తామన్నారు. ఆ మరుసటి ఏడాది మరో ఏడు కాలేజీలు ప్రారంభిస్తామని తెలిపారు. 17 వైద్య కళాశాలల నిర్మాణం కోసం రూ.8480 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కొత్త కాలేజీల వల్ల కొత్తగా 2250 యంబిబిఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఫ్యామిలీ డాక్టరు తీసుకువచ్చామని, వైద్యరంగంలో 53 వేల మందిని రిక్రూట్‌ చేశామని చెప్పారు. ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతిగ్రామంలోనూ వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించబోతున్నామన్నారు.
కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎప్పుడూ విద్య, వైద్యం ఈ రెండు విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతిచ్చి ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం ఏలూరులో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడమే కాకుండా మంచి మౌలిక సదుపాయాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. పోలవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మారుమూల ప్రాంతాల్లో ప్రజలు అత్యవసర వైద్యానికి రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని అయితే ఏలూరులో వైద్య బోధనాసుపత్రి రావడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మార్గం ఏర్పడిందన్నారు. ఏలూరు వైద్య కళాశాలలో 150 సీట్లు కలిగియుండగా, ఈ కళాశాల నిర్మాణానికి రూ.525 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఏలూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎంఎల్‌ఎ ఆళ్ల నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఏలూరు వైద్య కళాశాల ప్రారంభానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెసి బి.లావణ్యవేణి, జెడ్పఇ చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ, కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు, ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ పెదబాబు, యుడా ఛైర్మన్‌ మధ్యాహ్నపు ఈశ్వరీబలరాం, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మీ, నగర డిప్యూటీ మేయర్లు సుధీర్‌బాబు, గుడిదేశి శ్రీనివాస్‌, ఎపి మెడికల్‌ బోర్డు కౌన్సిల్‌ సభ్యులు దిరిశాల ప్రసాద్‌, కో-ఆప్షన్‌ సభ్యులు ఎం.జాన్‌గురనాధ్‌ పాల్గొన్నారు.
వైద్యకళాశాలల ప్రారంభం హర్షణీయం
రాష్ట్రంలో ఏలూరుతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ప్రారంభించుకోవడం హర్షణీయమని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ ప్రసాదరావు, కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ పాత్రికేయులతో మాట్లాడారు. గతంలో అవకాశమున్నా వైద్య కళాశాలలను ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. కానీ సిఎం జగన్‌ వైద్యరంగం అభివృద్ధికి నాలుగడులు ముందుకు వేశారన్నారు. ఏలూరు వైద్య కళాశాలలో 150 సీట్లు కేటాయించారని, ఏడాదికి రూ.10 వేలు ఫీజు మాత్రమే నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణకు ప్రభుత్వం ఏడాదికి రూ.250 కోట్లు ఖర్చుచేయనుందన్నారు.