ప్రజాశక్తి - హోళగుంద
మండలంలోని ఎల్లార్తి షేక్షావలీ, షాషావలీ దర్గాలో కానుకలు ఫుల్‌గా వస్తున్నా సౌకర్యాలు మాత్రం నిల్‌గా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఉరుసు సందర్భంగా భక్తులు కానుకలు ఫుల్‌గా సమర్పించుకున్నా సౌకర్యాలను కల్పించడం లేదు. దర్గా వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి వెళ్లినప్పటి నుంచి రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. ఇక్కడ మౌలిక వసతులైన మహిళలకు మరుగుదొడ్లు, తాగునీటి వసతి, గదులు వంటివి ఏర్పాటు చేయడం లేదు. భక్తులు హుండీలో వేసిన కానుకల్లో 30 శాతం ఖర్చు పెట్టినా మెరుగైన వసతులు కల్పించవచ్చు. ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించకపోవడం బాధాకరం. మహిళలు బహిరంగ ప్రదేశాల్లోనే బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తాగునీటి సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలు కూడా ఏ దేవాలయంలో లేని విధంగా అధికంగా వసూలు చేస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు.
ఉరుసు ఉత్సవాలు జరిగింది ఇలా
షేక్షావలీ, షాషావలీ తాత 361వ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గంధం, గురువారం ఉరుసు సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.










