బీజింగ్ : ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాలదే హవా. ఇప్పుడు చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి పడింది. అందులో భాగంగా వచ్చినవే సిఎన్జి, ఎల్పిజి, ఎలక్ట్రిసిటీతో నడిచే వాహనాలు. వీటి వల్ల కర్బన్ ఉద్గారాలు, గ్లోబుల్ వార్మింగ్ సమస్యలు కొంత మేరకు చెక్ పెట్టవచ్చుననే చెప్పవచ్చు. ఇవి మార్కెట్లో ఇప్పుడు విరివిగా రాబోతున్నాయి. ఇందులో వ్యాయామం, ఆరోగ్యం నిమిత్తం ఎక్కువగా వినియోగించే వాహనం సైకిల్. ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అయితే చైనా వీటికి ప్రత్యామ్నాయ వాహనాన్ని రూపొందించింది. తాజాగా హైడ్రోజన్‌తో నడిచే ఎలక్ట్రిక్ సైకిళ్లను చైనాకు చెందిన కంపెనీ ఇటీవల లాంచ్ చేసింది. ముందు ఈ సైకిళ్లను జియాంగ్జు ప్రావిన్స్‌లోని చాంగ్జు అర్బన్ సిటీలో లాంచ్ చేశారు. వాటిని సిటీలో రెంట్‌కు కూడా ఇస్తున్నారు. యూఆన్ అనే యాప్ ద్వారా వాటిని రెంట్‌కు తీసుకొని నడిపించవచ్చు.
ఈ సైకిల్ ప్రత్యేకతలేంటి?
ఈ సైకిల్ సీటు కింద హైడ్రోజన్‌తో తయారు చేసిన బ్యాటరీ ఉంటుంది. ఒకసారి హైడ్రోజన్‌తో బ్యాటరీని చార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. గంటకు 23 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ సైకిల్‌ను మెల్లగా తొక్కుతూ వెళ్లినా హైడ్రోజన్ బ్యాటరీ వల్ల వేగంగా వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు.2017 నుంచి యూఆన్ కంపెనీ హైడ్రోజన్ ఆధారిత ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారు చేయడం ప్రారంభించింది. అక్టోబర్ 2019 లో ట్రయల్ రన్ నిర్వహించిన విజయం సాధించింది.










