ఎకరాకు రూ.15 వేలు పరిహారం అందించాలి
ఎపి రైతుసంఘం కష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు
ప్రజాశక్తి-కోడూరు
వర్షాల కారణంగా అపరాల పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకునేందుకు ఎకరానికి రూ.15 వేలు పరిహారంగా చెల్లించాలని ఎపి రైతుసంఘం కష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు డిమాండ్‌చేశారు. కోడూరు గ్రామంలో రైతు సంఘం నాయకులు రేపల్లె రాము నివాసం వద్ద ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా అపరాల పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారందరూ ప్రభుత్వం ఆదుకోవాలని ముక్తకంఠంతో కోరుతున్నారన్నారు. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆయన కోరారు. రైతు పండించిన చివరి గింజ ను కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. రైతాంగ సమస్యలపై ఏప్రిల్ 5వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రైతు సంఘ నాయకులు ఆవుల బసవయ్య మాట్లాడుతూ పాలకాయతిప్ప అవుట్ ప్లాల్ స్లూయిస్‌ను తక్షణమే పునర్నిర్మాణం చేయాలని కోరారు. ఇప్పటికే 3000 ఎకరాలు పంట పొలాలు నాట్లు వేయకుండా ఖాళీగా వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు కు కూడా రూ.5000 పెన్షన్ అందజేయాలని కోరారు. మండలంలో 13 వేల ఎకరాలు అనాధీన భూములు ఉన్నాయని వాటన్నిటికీ కూడా గతంలో పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారని కోరారు. వాటిని కూడా నిషేధత జాబితాలో పెట్టారని, మరో 4000 ఎకరాలు పరా భూముల కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే వాటిని తీసివేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘ నాయకులు రేపల్లె యోగ ప్రకాష్, మెండు వెంకట కృష్ణారావు, మహమ్మద్ లతీఫ్, తమ్మా రత్తయ్య, బాలగోపాల రామకష్ణరాజు, గరికపాటి కన్నారావు, కంచరపల్లి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










