Oct 15,2023 00:19

మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు, రైతులు

ప్రజాశక్తి -అనంతగిరి: ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి తమ జిరాయితీ భూములు ఇచ్చేది లేదని ఉపాధి అవకాశాలతో పాటు ప్రధాన రహదారికి ఆనుకొని ఎక్కడైనా తమకు భూములు కల్పించినప్పుడే అంగీకరిస్తామని లేకుంటే ఇచ్చేది లేదని పాతకోట రైతులు చిటం సింహద్రి, నందుల. దొన్ను, చిటం .బీమన్న, చిటం. గాసి, పాంగి గాసిలు స్పష్టం చేశారు. శనివారం గ్రామంలో ఢిల్లీకి చెందిన ఏకలవ్య పాఠశాల సైట్‌ ఇంజినీరింగ్‌ విశ్వనాద్‌తో పాటు స్థానిక జెడ్పిటిసి దీసరి. గంగరాజు సందర్శించారు. అనంతరం రైతులతో కలిసి ఏకలవ్య పాఠశాల ఏర్పాటు విషయంపై రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు వారితో మాట్లాడుతూ, భూములు కోల్పోయిన తమకు భూములు కేటిస్తామని, పాఠశాలలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 2021 సంవత్సరంలో స్థానిక రెవిన్యూ జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత ఏకలవ్య పాఠశాల యాజమాన్యం తమకు నమ్మ బలి చేసిందని తెలిపారు. రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఉపాధి లేదన్నారు. తమ సాగు భూములు ప్రభుత్వం ఆధీనంలో తీసుకుందని, తమ భూములు తమకే తిరిగి ఇవ్వాలని లేకుంటే తాము కోరుకున్న చోట భూములు కేటాయించి ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే భూములు ఇవ్వడానికి అంగీకరిస్తామని రైతులు స్పష్టం చేశారు. లేకుంటే ఎట్టి పరిస్థితిలో ఇచ్చేది లేదని అన్నారు
జెడ్పిటిసి రంగరాజు మాట్లాడుతూ, ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాగులో ఉన్న 18 ఎకరాల జిరాయికి భూములను దానం చేశారన్నారు. ప్రభుత్వం ఆ రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాల్సినప్పటికీ నేటికీ రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ భూమికి భూమి కేటాయించి కుటుంబానికి ఉపాధి అవకాశాలు చూపించవలసి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం చేయలేదన్నారు. ఏకలవ్య పాఠశాల సైట్‌ ఇంజనీరింగ్‌ అధికారులు కూడా సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి రైతుల గోడును వినిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైట్‌ ఇంజనీరింగ్‌ స్థానిక సిపిఎం మండల కార్యదర్శి నాగులు, ఉప సర్పంచ్‌ పాంగి. అర్జున్‌, వార్డు మెంబర్‌ చిట్టం. వెంకటరావు, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.