భామిని: మండలంలోని బొడ్డగూడ పంచాయతీ పరిధిలో 10 గిరిజన గ్రామాల్లోనూ, పూతిక వలస పంచాయతీ పరిధిలోని 10 గిరిజన గ్రామాల్లో గిరిజనుల ఆర్థిక, సామాజిక, సంప్రదాయాలు, సాంస్కృతిక జీవన విధానం, ప్రభుత్వ ఆరోగ్య సేవలను 5 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు 13 మందితో కూడిన ట్రైనీ ఐఎఎస్‌ల బృందం మండలానికి విచ్చేసింది. భామినిలో కొత్తగా నిర్మించిన గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాల అదనపు భవనానికి వీరు ఆదివారం చేరుకున్నారు. 13 మంది ఐఎఎస్ లు రెండు బృందాలుగా పూతికవలస, బొడ్డవలస పరిసర గ్రామాలు పరిశీలించనున్నట్లు ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి తెలిపారు. ట్రైనీ ఐఎఎస్‌ల రాకతో అధికారులు శరవేగంగా రహదారి, విద్యుత్ లైన్లు, వసతి గృహ అదనపు భవనానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం నుండి 5 రోజులు పాటు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గిరిజన పల్లెల్లో పర్యటించి గిరిజన జీవన స్థితిగతులు అధ్యయనం చేయనున్నట్లు ఐటిడిఎ అధికారులు తెలిపారు. ఈ బృందంలో ట్రైని ఐఎఎస్‌లు ఆదర్స్ పటేల్, వరుణ్ గౌడ, తుషార్ కుమార్, సోనం, శ్రీదేవి బివి, సిందే తుషార్ శ్రీహరి, మీరా పి ఆర్, వైశాలి.ఆర్, పియుష్ కుమార్, రుశేలి క్లర్, అభినవ్ ద్వివేది, అభిషేక్ బిందు,హార్ష్మిరాన్ సింగ్ చీమ ఉన్నారు. వీరి వెంట ఐటిడిఎ సిసి సతీష్, ఎఎంఒ కోటిబాబు, తహశీల్దార్ అప్పారావు, గిరిజన వసతి గృహ సిబ్బంది వున్నారు.
ఏజెన్సీలో పర్యటించిన ట్రైనీ ఐఎఎస్ లు
గుమ్మలక్ష్మీపురం : స్థానిక ఏకలవ్య గురుకుల మోడల్ పాఠశాలను ట్రైనీ ఐఎఎస్‌లు తమ శిక్షణలో భాగంగా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రిన్సిపల్ పెంటన్నతో మాట్లాడి ఏజెన్సీలో విద్యా విధానంపై, ఫలితాలు సాధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏకలవ్య భవన నిర్మాణానికి సుమారు రూ.22 కోట్లు ఖర్చయినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ భవనంలో విద్యార్థులకు కావలసిన తరగతి గదులు, డార్మెటరీ, వంటగది, భోజన గది, టాయిలెట్స్ తదితర అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రధానోపాధ్యాయులకు, వార్డెన్‌కు క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థుల విద్యా ప్రమాణాలను సంబంధిత ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ట్రైనీ ఐఎఎస్‌లు మమేకమయ్యారు. వారితో ఆటలు, పాటలు ఆడారు.










