Oct 15,2023 00:17

జి.మాడుగులలో పర్యటిస్తున్న బృందం సభ్యులు

ప్రజాశక్తి-పాడేరు : ఒన్‌ డిస్ట్రిక్ట్‌ - ఒన్‌ ప్రొడక్ట్‌ అధ్యయనానికి దేశంలోని అన్ని జిల్లాలలో వివిధ బృందాలు పర్యటిస్తున్నాయని, తమ బృందం విశాఖపట్నంలో చేపల ఉత్పత్తి, కాఫీ ఉత్పత్తిపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఇన్వెస్ట్‌ ఇండియా బృంద సభ్యులైన సౌమ్య, ఆకాంక్ష తెలిపారు. ఒక జిల్లా ఒక పంట (వన్‌ డిస్టిక్‌ వన్‌ ప్రోడక్ట్‌ ) అనే అంశంపై అధ్యయనం చేయడానికి ఢిల్లీ నుండి వచ్చిన ఇన్వెస్ట్‌ ఇండియా బృందం సభ్యులతో శనివారం ఐటిడిఎ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ,కాఫీ రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని ఇన్వెస్ట్‌ ఇండియా బృంద సభ్యులైన సౌమ్య, ఆకాంక్షలకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ చెప్పారు. దేశంలో మిగిలిన ప్రాంతాల కన్నా ఇక్కడి పరిస్థితులు విభిన్నమని, ఇక్కడి గిరిజనులు కాఫీ పంటను సాంప్రదాయ పద్ధతిలో పండిస్తారన్నారు., పాడేరు డివిజన్లో 11 మండలాల పరిధిలో సుమారు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుతో 2.46 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. అరకు కాఫీ బ్రాండ్‌ పేరుతో కాఫీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు.
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ మాట్లాడుతూ కాఫీ సాగు ఎలా మొదలైంది, ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నది, గిరిజనులకు అందుతున్న ప్రయోజనాలు, వారికి అందిస్తున్న యంత్రాలు, వారికి కల్పిస్తున్న మార్కెట్‌ సౌకర్యాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో వివరించారు. ఇటీవల బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ కాఫీ కాన్ఫరెన్స్‌లో అరకు కాఫీకి అవార్డు వచ్చిందని, కాఫీ పంటలో ఉత్తమ రైతు అవార్డు పొందిన పెదబయలు మండలం లక్ష్మీపురం పంచాయతీ కప్పడ గ్రామం రైతు కిల్లో యశ్వనిని బృంద సభ్యులకు పరిచయం చేశారు. అనంతరం స్టాల్స్‌ పరిశీలించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కే శివ శ్రీనివాస్‌, ఐటీడీఏ పీవో వి అభిషేక్‌, ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారులు ప్రభాకర్‌, ఎం.వెంకటేశ్వరరావు, కాఫీ బోర్డ్‌ డిడి రమేష్‌ పాల్గొన్నారు.
కాఫి మ్యూజియం సందర్శన
అరకులోయ:ఇన్వెష్ట్‌ ఇండియా బృందం సభ్యులు శనివారం అరకులోయ లోని కాఫీ మ్యూజియంను సందర్శించారు. సుంకరమెట్ట కాఫీ తోటలను పరిశీలించారు. అరకు వ్యాలీ కాఫీ అద్భుతంగా ఉందని బృందం సభ్యులు సౌమ్య అన్నారు. కాఫీ మ్యూజియంలో కాఫీ జర్నీ వివరాలను వివరించారు.ఈ కార్యక్రమంలో కాఫీ డిడి రమేష్‌ పాల్గొన్నారు.
కాఫీ యూనిట్‌ పరిశీలన
జి మాడుగుల:ఇన్వెస్ట్‌ ఇండియా బృందం మండలంలోని ఎం.నిట్టాపుట్టు గ్రామాన్ని సందర్శించి కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ను పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి కాఫీ పల్పింగ్‌ విధానంపై అడిగి తెలుసుకున్నారు. కాఫి సాగు, దిగుబడి, మార్కెటింగ్‌ సదుపాయాలపై ఆరా తీశారు. ముందుగా గిరిజన రైతులు గిరిజన సంప్రదాయంలో ఘనంగా స్వాగతం పలికారు. బృందం సభ్యులతో కాఫీ బోర్డ్‌ డిడి రమేష్‌, జి.సి సి డిఎం సింహాచలం తదితలు పాల్గొన్నారు.