గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో గిరిజన విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ఆయన గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థినులు ప్రతీ ఏటా నిర్వహించే గిరిజనోత్సవాల్లో సవర, కంది కొత్తలు నృత్యాలు ప్రదర్శిస్తున్నట్లు తెలపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూలు తెగలలో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారని అడగ్గా సవర, కొండ దొర, సవర వంటి వర్గాల విద్యార్థులు విద్య ను అభ్యసిస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి సి.విష్ణు చరణ్ వివరించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యా బోధన ఏ విధంగా జరుగుతుంది, క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తున్నారా లేదా, చదువులో ఏ మేరకు పట్టుసాధించారు అన్న విషయాలను విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనాలు సక్రమంగా పెడుతున్నారా లేదా? ఏఏ సమయాల్లో భోజనాలు పెడుతున్నారు, ఆటలు, భరతనాట్యం వంటివి నేర్పుతున్నారా అని విద్యార్థులను అడిగారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిసిసి, వెలుగు, ఐటిడిఎ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ పరిశీలించారు. అనంతరం గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యులతో మాట్లాడుతూ రోజు వారి ఒపి, రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీరు, మరుగుదొడ్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ స్టేట్ డైరెక్టర్ సుశీల, గిరిజన సంక్షేమశాఖ డిడి శ్రీనివాసరావు, జిసిసి డిఎం మహేంద్ర కుమార్, ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ పెంటన్న, పలు శాఖల అధికారులు ఉన్నారు.
కురుపాం : మండలంలో నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలికల పాఠశాలను జాతీయ ఎస్‌టి కమిషన్ సభ్యులు అనంత నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పాఠశాలలో గల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా పుష్పగుచ్చలతో స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను పరీక్షించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన డెమో యూనిట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన భోజనాన్ని సక్రమంగా అందించి పాఠశాల ఆవరణ ప్రాంతంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థుల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, డిడి కె.శ్రీనివాసరావు, ఎటిడబ్ల్యుఒ కె.చంద్రబాబు, ఎంపిడిఒ వివి శివరామప్ప, పాఠశాల హెచ్‌ఎం గిరిజారాని, హాస్టల్ సంక్షేమాధికారి ఒమ్మి చిలకమ్మ, స్థానిక సర్పంచ్ ఎ.మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
బెలగాం : గిరిజన ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కరించాలని పలు గిరిజన సంఘాలు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులకు విన్నవించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు చేపట్టాలని, విద్యార్థులు, సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏనుగుల సమస్యల పరిష్కరించాలని, పూర్ణపాడు -లాబేను వంతెన నిర్మాణం జరగాలని, 1/70 చట్టం అమలు జరగాలని, తాగు నీటి సమస్య, గిరిజన ప్రాంత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. బోయ, వాల్మీలను గిరిజన తెగల్లో చేర్చకూడదని, గిరిజన యూనివర్సిటీ గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని గిరిజన సంఘనాయకులు వినతులు ఇచ్చారు. ఐటిడిఎ పాలక మండలి సమావేశం నిర్దిష్ట సమయంలో జరగడంలేదని, నిధులు గిరిజనుల కోసమే ఖర్చు చేయాలని, ఎస్టీ ప్రాంతంలో ఉద్యోగాలు ఎస్టీ లతోనే భర్తీ చేయాలని, గిరిజన ప్రాంతాల్లో ఖనిజాలు గిరిజనులు వెలికతీసేందుకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. వీటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సభ్యులు తెలిపారు. వినతులు సమర్పించిన వారిలో పల్లా సురేష్, కె.మల్లేశ్వర రావు, ఎం. గిరిధర్, ఎం. పాపారావు, పి. రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు.










