ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : జిల్లా వ్యాప్తం రాగులు పంటను ప్రోత్సహించేందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్దతు ప్రకారం ధాన్యం కోనుగోలు కేంద్రాల మాదిరిగా ఖరీఫ్ 2023-24 సీజనుకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు గాను రాగుల మద్దతు ధర క్వింటాకు రూ.3846గా నిర్ణయించామని తెలిపారు. వ్యవసాయ శాఖ వారి రాగులు దిగుబడి అంచనాలకు అనుగుణంగా ఈనెల 20 నుండి రాగులు పండించిన విస్తీర్ణం గల రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రభుత్వం తరపున రాగుల కొనుగోలు ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేశామని తెలిపారు. రైతులు తాము పండిచిన రాగులను ప్రభుత్వం వారు ప్రకటించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి సరుకు అమ్ముకోవచ్చని అన్నారు. ఈ కొనుగోలులో రైతులెవ్వరు కూడా దళారులను నమ్మి మోసపోకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం వారు ధాన్యము కొనుగోలు ప్రక్రియ మదిరిగానే రాగుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ముఖ్య ఉద్ధేశ్యమని తెలిపారు. ఈ ముకఎ జిల్లాలో సీతంపేట, సాలూరు, పాచిపెంట, పార్వతీపురం, కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం లో రాగుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో మొత్తం రాగుల ఉత్పత్తి 936 టన్నులు కాగా, రైతులు వినియోగం 468 టన్నులు పోగా. 468 టన్నులు.కొనుగోలుకు అంచనాలు వేస్తున్నామని తెలిపారు.
ధాన్యం కొనుగోలుకు ముమ్మర ఏర్పాట్లు
ప్రతి సీజన్ లాగానే రాబోయే 2023-24లోనూ ధాన్యం సేకరించే నిమిత్తం ముమ్మర ఏర్పాట్లు చేస్తుందని జెసి గోవిందరావు అన్నారు. ఈ సీజన్‌లో కూడా వివిధ రైతు భరోసా కేంద్రాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు, తద్వారా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మేలు కలిగేలాకనీస మద్దతు ధర పూర్తిస్థాయిలో అందించేందుకు ప్రభుత్వం తరుపున సన్నాహాలు ప్రారంభించామని తెలిపారు. 2023-24 పంట కాలానికి గానూ ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలకు రూ.2183, గ్రేడ్ ఎ రకం రూ. 2203 లు ప్రకటించారని, అయితే ఈఏడాది రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే వాహనాలకు జిపిఎస్ యంత్రాల వినియోగం తప్పని సరి చేశామని అన్నారు. ఈసీజన్‌లో బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇక్రాప్‌లో నమోదై, ఈకెవైసి చేయించుకున్న రైతుల దగ్గర మాత్రమే ధాన్యం సేకరణ జరుగుతుందని అన్నారు. కొనుగోలు విషయంలో రైసుమిల్లర్లను ఏ రైతు సంప్రదించాల్సిన అవసరం లేదని, వారి ఎంపిక ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. రైతుల సౌకర్యార్ధం గోనెసంచులు, హమాలీలు, ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చూసుకుంటుందని, అన్నారు. ఒకవేళ వాటిని రైతులు ఏర్పాటు చేసుకుంటా అందుకు తగిన మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమచేస్తామని తెలిపారు.










