Aug 25,2023 19:46

నదిలో నీరు లేక తేలిన ఇసుక

ప్రజాశక్తి - కౌతాళం
తుంగభద్ర నది వర్షాకాలంలో జలాలతో పరవళ్లు తొక్కుతూ పరుగులు తీయాల్సిన రోజులు. ప్రస్తుతం నీరు లేక రాజస్థాన్‌ ఎడారిలా దర్శనమిస్తోంది. కొనసీమను తలపించే తుంగభద్ర నదీతీర గ్రామాల పంట పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయి. ఆనందంతో ఎరువులు వేయాల్సిన అన్నదాతల కళ్లల్లో కన్నీరు పారుతున్నాయి. వర్షాల్లేక సాగయిన పంటలు వాడిపోతున్నాయి. వ్యవసాయం కోసం రూ.వేలకు వేలు అప్పులు చేసి సాగు చేసిన అన్నదాతకు కంటి నిండా కునుకు లేకుండా ప్రకృతి కన్నెర్ర చేసింది. తుంగభద్ర నదీతీర రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది...
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది జలాలు ప్రవేశించే ప్రాంతం కౌతాళం మండలం మేళిగనూరు గ్రామం. ఈ నది ఈ గ్రామం నుంచి నదీచాగి, కుంభాలనూర్‌, కుంభాలనూరు క్యాంపు, మురళి, గుడికంబాళి ద్వారా ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రాంత రైతులు వరి పంటను సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. సుమారు 2 వేల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేశారు. తుంగభద్ర నదిలో నీరు లేకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. అన్నదాత గుండె బాధతో బరువెక్కింది. వరుణుడైన కరుణిస్తాడా అనే బెంగతో ఎదురుచూస్తున్నారు. నెల రోజులవుతున్నా సరైన వర్షాలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బోర్ల కింద సాగు
ఈ ప్రాంతంలో కొంతమంది రైతులు వ్యవసాయ బోర్ల కింద పంటలు సాగు చేశారు. ఈ రైతులకు విద్యుత్‌ కష్టాలు మొదలయ్యాయి. 9 గంటలు విద్యుత్‌ సరఫరా కావాల్సి ఉండగా కోతలతో రైతుకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నారు. గంట గంటకు విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడడంతో బోరు నీళ్లు ముందుకు వెళ్లక, భూమి తడవక, పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో..? ఎంతసేపు వస్తుందో.. ఉంటుందో తెలియక అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రైతులను ఆదుకోవాలి
- తెలుగు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్‌

తుంగభద్ర నది కింద సాగు చేసిన రైతులను ఆదుకోవాలి. తుంగభద్ర జలాశయం నుంచి తుంగభద్ర నదికి నీటిని వదిలి పంటలను కాపాడాలి. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించకపోతే రైతులు ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలవుతారు.

బీటలు బారిన పంట పొలాలు
బీటలు బారిన పంట పొలాలు