పుట్టపర్తి అర్బన్ : 2025లో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తామని సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ పేర్కొన్నారు. సత్యసాయి 12వ ఆరాధన ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. హిల్ హ్యూ స్టేడియంలో సత్యసాయి భజన అనంతరం స్టేడియంలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు పరిసర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అన్న ప్రసాదాలతో పాటు మహిళలకు చీరలు, పురుషులకు ధోవతిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ విలేకరులతో మాట్లాడుతూ ఆరాధనోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. వేలాది మంది ఈ కార్యరక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. ఆరాధన ఉత్సవాలు పుట్టపర్తిలోనే కాక ప్రపంచం నలుమూలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సత్యసాయి ఆశయాల మేరకు సేవా కార్యక్రమాలను ట్రస్టు కొనసాగిస్తుందన్నారు. 2025లో సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు.










