Sep 11,2023 14:54

కోల్‌కతా  :   ప్రతిపక్ష కూటమి ఇండియా కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం రోజునే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడి) నోటీసులివ్వడంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ మండిపడ్డారు. ఇండియాను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. స్కూల్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాం కేసులో ఈ నెల 13న విచారణకు హాజరుకావాలని ఈడి అభిషేక్‌ బెనర్జీకి సమన్లు జారీ చేసింది. అయితే అదే రోజున ప్రతిపక్ష కూటమి ఇండియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఢిల్లీలో సమావేశం కానుందని అభిషేక్‌ బెనర్జీ పేర్కొన్నారు. ఇండియా కో ఆర్డినెషన్‌లో సభ్యుడిగా తాను ఆ సమావేశానికి హాజరుకావాల్సి ఉందని అన్నారు.

'' ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం సెప్టెంబర్‌ 13న ఢిల్లీలో జరగనుంది. ఆ కమిటీలో నేను సభ్యుడిని. కానీ అదే రోజున విచారణకు హాజరుకావాలని ఈడి నోటీసులిచ్చింది. 56 అంగుళాల చాతీ మోడల్‌ (ప్రధాని) పిరికితనం చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేరు '' అని అభిషేక్‌ బెనర్జీ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

రిక్రూట్‌ మెంట్‌ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈడి, సిబిఐలు రెండు సమన్లు జారీ చేశాయి. ఈ కుంభకోణంలో చట్ట విరుద్ధమైన మార్గాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది నియామకాలు జరిగినట్లు ఈడి వాదిస్తోంది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర మాజీ విద్యా మంత్రి పార్థ ఛటర్జీ సహా పలువురు అధికారులు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.