Sep 12,2023 14:56

చెన్నై :   ఇసుక మైనింగ్‌ కుంభకోణం పేరుతో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంపై దాడికి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) అధికారులు మంగళవారం ఉదయం నుండి ఏకకాలంలో సోదాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా తమిళనాడు జలవనరుల శాఖ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుకను విక్రయించడంతో పాటు ఇ-రసీదును జారీ చేస్తుంటుంది. అయితే పెద్ద మొత్తంలో ఇసుకను ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్నారని... రోజువారీ రికార్డుల్లో నమోదు కావడం లేదని ఈడి ఆరోపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వేలాది మంది లారీ యజమానులు/ ఆపరేటర్స్‌కి జారీ చేసిన ఇ-రసీదుల ద్వారా పన్ను ప్రభుత్వ ఖాతాల్లో జమ చేశారా లేదా అని విచారణ చేపడుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

సోదాలపై తమకు సమాచారం లేదని, ఈడి అధికారులు కేంద్ర ప్రభుత్వ బలగాల సాయంతో విచారణ చేపడుతున్నాయని తమిళనాడు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇసుక విక్రయాలు నిర్వహించే వెల్లోర్‌, తిరుచ్చి, కరూర్‌, పుదుకొట్టారు వంటి ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని, ఇసుక మైనింగ్‌ కాంట్రాక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.