ప్రజాశక్తి - చిప్పగిరి
ఆలూరు బ్రాంచి కెనాల్‌పై అక్రమ మోటార్లను, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మోటార్లను ఇరిగేషన్ అధికారులు తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. ఆలూరు బ్రాంచి కెనాల్ (ఎబిసి) ఆయకట్టు రైతులు దాదాపు 200 మంది శనివారం గుంతకల్లు ఇఇ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సొసైటీ బ్యాంకు ఛైర్మన్ డేగులపాడు మల్లికార్జున, సర్పంచి నీలకంఠ, వైసిపి నాయకులు ఏరూరు, నగరడోన సర్పంచుల భర్తలు సేనాపతి, నాగేంద్ర, మల్లికార్జున పల్లె రామాంజనేయులు, తిమ్మాపురం హేమంత్ ఆధ్వర్యంలో అర్ధగేరి, రామదుర్గం, ఏరూరు, డేగులపాడు, నగరడోనా గ్రామాల రైతులతో కలిసి గుంతకల్లు ఇఇ కార్యాలయం చేరుకున్నారు. కాలువపై అక్రమ మోటార్లను తొలగించాలని డిఇ మంజునాథ్‌ను నిలదీశారు. సొసైటీ బ్యాంకు ఛైర్మన్ మల్లికార్జున, డేగలహాల్ సర్పంచి నీలకంఠ మాట్లాడుతూ... రైతులు మిరప పంటలను సాగు చేశారని తెలిపారు. ఆయకట్టు రైతులకు సాగు, తాగునీరు రాకుండా కాలువ పొడవునా అక్రమంగా నాన్ ఆయకట్టు రైతులు మోటార్లను పెట్టి జలచౌర్యానికి పాల్పడుతున్నారని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అసలైన ఆయకట్టు రైతుల పంటలకు నీరందక ఎండిపోయి ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని వాపోయారు. జలచౌర్యానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, అక్రమ మోటార్లు తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిద్రావస్థలో, మామూళ్ల మత్తులో ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని వాపోయారు. ఇరిగేషన్ డిఇ మంజునాథ్ మాట్లాడుతూ... ఎవరైనా సరే పైసా ఇచ్చారంటే తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని తెలిపారు. తాను నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తానని చెప్పారు. కాలువపై అక్రమంగా పెట్టిన మోటార్లను తొలగించడానికి ఇద్దరు ఎఇలను, లస్కర్లను, ఇద్దరు ఎస్‌ఐలను కాలువపై ఉంచినట్లు తెలిపారు. తాము కూడా వచ్చి ఈరోజు చెప్పి వినకపోతే రేపటి నుంచి మోటార్లను తీసుకొచ్చి చిప్పగిరి పోలీసు స్టేషన్లో అప్పగిస్తామని చెప్పారు. రైతులు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు నుంచి సాగునీరు సక్రమంగా అందుతుందన్నారు. రైతులు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. రైతులు మాట్లాడుతూ... అధికారులు తమకు సహకరిస్తే తామూ సహకరిస్తామని తెలిపారు. తమకు నీరే కావాలని, గొడవలు, అల్లర్లు అవసరం లేదని చెప్పారు. ఇరిగేషన్ డిఇ మంజునాథ్ రైతులతో కలిసి ఆలూరు బ్రాంచి కెనాల్‌పై పర్యటించి అక్రమ మోటార్లను తొలగించాలని నిబంధనలకు విరుద్ధంగా మోటార్లు పెట్టిన రైతులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్లను తీసుకెళ్లి పోలీసు స్టేషన్లో అప్పగిస్తామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గుంతకల్లు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పంటలను కాపాడండి
- పంజా, డేగలపాడు రైతు
సాగునీరందించి ఎండిపోయే మిరప పంటలను కాపాడాలి. అక్రమ మోటార్లు తొలగించి నిజమైన ఆయకట్టు రైతులకు సాగునీరందించి న్యాయం చేయాలి.
డిఇ మంజునాథ్‌తో వాగ్వాదానికి దిగిన రైతులు










