Oct 19,2023 19:57

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి జూటూరు హేమలత మారయ్య

ప్రజాశక్తి - చిప్పగిరి
తుంగభద్ర జలాశయ విభాగంలోని ఆలూరు బ్రాంచి కాలువకు జనవరి చివరి వరకు సాగు, తాగునీరందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించినట్లు ఎంపిపి దంపతులు జూటూరు హేమలత మారయ్య తెలిపారు. గురువారం చిప్పగిరిలో ఎంపిపి, ఆమె భర్త మారయ్య మాట్లాడారు. ఆలూరు బ్రాంచి కెనాల్‌ రైతుల సమస్యలను కార్మిక శాఖ మంత్రి జయరాం సమక్షంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆలూరు బ్రాంచి కాలువ కింద 14 వేల హెక్టార్లకు పైగా పంటలు సాగు చేశారని చెప్పారు. నీరు అరకొరగా అందడంతో ఇబ్బందులు పడుతూ రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని తెలిపారు. హంద్రీ కాలువ నుంచి ఆలూరు బ్రాంచి కాలువకు సాగు, తాగునీరు విడుదలయ్యే విధంగా చూడాలని కోరినట్లు చెపాపరు. స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జనవరి చివరి వరకు సాగు, తాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వైసిపి యువ నాయకులు ధనుంజయ, లాల్‌ స్వామి, లింగన్న పాల్గొన్నారు.