Oct 18,2023 15:56
  • డివైఎఫ్ఐ డిమాండ్.

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు గురువారం వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలైన రాష్ట్రంలోని ఖాళీ పోస్టుల భర్తీ యువత ఉపాధి కల్పన కోసం కర్నూలు జిల్లాలో పరిశ్రమలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్ జిల్లా ఉపాధ్యక్షులు హుస్సేన్ భాష నాయకులు సూర్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తానని, ప్రతి సంవత్సరం ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి జనవరి ఒకటవ తేదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు పూర్తయిన ఒక్కసారి మాత్రమే జాబ్ లెస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. వాటిని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ గానీ, ఒక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా గురువారం ఎమ్మిగనూరు లో జరిగే బహిరంగ సభలో ప్రభుత్వ నోటిఫికేషన్ లపై ఒక స్పష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. కర్నూల్ జిల్లాలో ప్రతి సంవత్సరం ఆరు లక్షల మంది వలస వెళుతున్నారని కావున కర్నూలు ఓర్వకల్ పారిశ్రామిక హబ్ ఎమ్మిగనూరు టెక్స్టైల్ పార్క్, ఆదోని జిన్నింగ్ ప్రెస్సింగ్ మిల్లులు పత్తికొండ టమోటా జ్యూస్ సాస్ ఫ్యాక్టరీ కర్నూలు జిల్లాలో ఐటీ ఫార్మా బిపిఓ కంపెనీలను ఏర్పాటు చేసి జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించి వలసలను నివారించాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటునుండి ఇప్పటివరకు కర్నూలు జిల్లా ప్రజానీకం ముఖ్యంగా యువతి యువకులు తిరుగులేని మెజారిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారని అలాంటి జిల్లాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఒక పరిశ్రమ గాని, ఒక సాగునీటి ప్రాజెక్టు కానీ ఇవ్వలేదు. ప్రస్తుతం జిల్లాల విభజన తర్వాత అత్యంత వెనుకబడిన జిల్లాగా కర్నూల్ ఉంది. ఇప్పటికైనా ఈ జిల్లాను అభివృద్ధి చేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన కరువును ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా యువతకు రైతులకు పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ పై స్పష్టమైన ప్రకటన చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లా యువతి యువకులు ప్రజానీకం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.