Mar 18,2023 16:52

ప్రజాశక్తి-కృష్ణా : అవ్వా.. బాగున్నావా..! తాతయ్య ఎలా ఉన్నావ్..! అంటూ ప్రభుత్వ వైద్యాధికారి ఇంటి వద్దకే  వైద్య పరికరాలు, వైద్య సిబ్బందితో వృద్ధాప్యంతో  బాధపడుతున్న రోగుల ఇండ్లకే వెళ్లి వైద్యాన్ని అందిస్తున్న విధానానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రత్యేక చొరవతో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్  ( ఇంటి వద్దకే  వైద్యం ) విజయవంతంగా ముందుకు సాగుతోంది. అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (AEMS) వారి ఆధ్వర్యంలో గడిచిన రెండేళ్లకు పైగా కొనసాగుతున్న 104 సంచార వైద్యశాల కు అనుసంధానంగా ప్రవేశపెట్టిన ఈ ఫ్యామిలీ పిజిషన్ కాన్సెప్ట్ తో  గ్రామీణ ప్రాంతాల్లోని ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న అవ్వలకు తాతయ్యలకు  ఎంతో ఉపయోగంగా ఉందని  సర్వత్ర  దీనిపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అరబిందో కంపెనీ జిల్లా మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్ సూచనలతో మచిలీపట్నం డివిజన్ ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్ కాలారి శ్రీనివాస పెరుమాళ్లు 104 సిబ్బందిని ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కు అనుసంధానం చేస్తూ.. సంచార వైద్య శిబిరంలో  వైద్య సేవలను సక్రమంగా అందేలా  పర్యవేక్షిస్తున్నారు. మోపిదేవి మండలంలో  శనివారం మోపిదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాగాయ తిప్ప  శివారు పోచుగానిలంక గ్రామంలో అంగన్వాడి కేంద్రం  వద్ద 104 సంచార వైద్య శిబిరం, ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ లో మోపిదేవి పీహెచ్ సి వైద్యాధికారి బి. లక్ష్మీ నాథ్  పాల్గొని వైద్య సిబ్బందితో అవసరమైన వారికి  ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించారు. ప్రభుత్వ వైద్యాధికారిని  మెడలో స్టెతస్కోప్ ధరించి.. అవ్వ తాతయ్యలా ఇండ్ల  వద్దకే వెళ్లి వారి ఆరోగ్యాన్ని వాకబ్ చేసి.. స్టెతస్కోప్ తోను, బిపి యంత్రాలతోనూ  వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి వారికి తగిన ఆరోగ్య సలహాలతో పాటు  మధుమేహ, రక్తపోటు వ్యాధులకు ఉచితంగా నెలకు సరిపడా మందులను అందిస్తున్నారు. శనివారం నిర్వహించిన వైద్య శిబిరంలో 40 మంది రోగులను పరీక్షించి  మందులను అందించారు. పోచుగాని లంకలో నిర్వహించిన ఈ ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి  హోమ్ విజిట్ లో భాగంగా ఓ ఇంటికి వర్షంలో సైతం వైద్య సిబ్బందితో వెళ్లి పక్షవాతంతో ఇంటికే పరిమితమైన ఓ తాతయ్యకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి  వైద్య సలహాలను ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందని ద్రాక్షగా ఉన్న వైద్యాన్ని... ముఖ్యమంత్రి వై ఎస్.జగన్మోహన్ రెడ్డి చొరవతో అవసరమైన వారి ఇండ్ల వద్దకే ప్రభుత్వ వైద్య సిబ్బంది మొత్తం అందుబాటులోకి వచ్చి వైద్యం అందిస్తుండడంపై సర్వత్ర హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. చంటి బిడ్డలకు, గర్భిణీలకు, బాలింతలకు, బీపీ షుగర్ రోగాలతో  సాధారణ వైద్య సలహాల కోసం, వైద్యం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చి దూరభారాలతో  ప్రైవేటు ఆసుపత్రులకు  వెళ్లి వేలాది రూపాయలను  వెచ్చిస్తున్న  గ్రామీణ ప్రాంత సామాన్యుల పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ తో ఓ చక్కని పరిష్కారం లభించిందని  గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. శనివారం నిర్వహించిన 104 సంచార వైద్య శిబిరంలో మోపిదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బి. లక్ష్మీనాధ్, సిహెచ్ఓ పి.సుగుణ, 104 మోపిదేవి డీఈవో ఎస్. అనిల్ బాబు, సిబ్బంది డి.పోతురాజు, mlhp జె. రేఖ, ఏఎన్ఎం పి.లక్ష్మి కుమారి,  ఆశా కార్యకర్తలు  పి.రామలక్ష్మి, ఆర్.రమాదేవి, వి.బుజ్జి పాల్గొన్నారు.