Aug 29,2023 20:08

సప్త రాత్రోత్సవాలను ప్రారంభిస్తున్న పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. రాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాల సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థుల ఆధ్వర్యంలో శ్రీమఠం ముఖద్వారంపై కాషాయ జెండాను పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ ప్రారంభించారు. అనంతరం గోపూజ, అశ్వపూజ, లక్ష్మీ ధాన్య వంటి పూజలు నిర్వహించి, బాజాభజంత్రీలతో మంగళ హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు మాట్లాడారు. విశ్వగురువుగా పేరుగాంచిన రాఘవేంద్రస్వామి 352వ ఆరాధన సప్త రాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థమై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం, వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తుంగభద్ర నదిలో నీరు లేకపోవడంతో నదీ తీరంలో షవర్లు ఏర్పాటు చేశామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, శ్రీమఠం ఆరోగ్యశాల నుంచి ప్రాథమిక చికిత్స కేంద్రాలను, అంబులెన్స్‌ సౌకర్యం అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆరాధనోత్సవాలకు ప్రముఖులు, దాతలు అధిక సంఖ్యలో వస్తుంటారని, సామాన్య భక్తులకు సామూహిక వసతి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఉంచామని, భక్తులు సుచి, శుభ్రతను పాటించాలని సూచించారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, విద్యుత్‌, గ్రామ పంచాయతీ శాఖల అధికారుల సహకారంతో పోలీసు శాఖ భద్రతల మధ్య దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిపాలన కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పూజలు నిర్వహించి సిబ్బందిని ఆశీర్వదించారు. రాష్ట్రపతి ప్రతిభ అవార్డు గ్రహీత, డాక్టరేట్‌, పండిత కేసరి మహామహోపాధ్యాయ బిరుదాంకితులు రాజా ఎస్‌ గిరియాచార్యులు, పీఠాధిపతుల పూర్వాశ్రమ కుమారులు రాజా ఎస్‌ అప్రమేయాచార్‌, ఎఎఒ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కె.శ్రీనివాసరావు, వెంకటేష్‌ జ్యోషి, ఆధ్యాత్మిక అభివృద్ధి అధికారి శ్రీపతిఆచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి.నరసింహ మూర్తి, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్‌ రావు పాల్గొన్నారు.