ప్రజాశక్తి - పెనుకొండ : ఆటో కార్మికుల సమస్యలపై ఈనెల 23వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ కోరారు. ఈ మేరకు గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్నాకు సంబందించిన పోస్టర్లను విడుదల చేశారు. జరిగింది. ఈ సందర్భంగా ఆటో కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెడపల్లి బాబా, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ వారం రోజుల నుండి ఆటోలపై పోలీసు వేధింపులు తీవ్రతరమయ్యాయని అన్నారు. ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో కొద్దిమందికి మాత్రమే 10వేల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి ఈ చలన రూపంలో వేల రూపాయలను ఆటో కార్మికులతో దోచుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు బలవంతంగా కేసులు పెట్టుతున్నారన్నారు. అనేక మంది నిరుద్యోగులు డిగ్రీ ,పీజీలు చేత పట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఆటోలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఇటువంటి పరిస్థితిలో కొత్తగా జీవో నెంబర్ 290తో కేసులు పెట్టి ఆటోలను పోలీస్ స్టేషన్ తరలించే పరిస్థితి నెలకొందన్నారు. ఆటో కార్మికుల సమస్యలపై ఈనెల 23వ తేదీన సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాకు ఆటో కార్మికులు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పైపల్లి గంగాధర్, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, తిప్పన్న, మహబూబ్‌బాషా, ఆటో కార్మికుల యూనియన్ నాయకులు వజ్రం నాగప్ప, హనుమంతు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.










