ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్
ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్
ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ విమర్శించారు. బుధవారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మండల నాయకులు పకీర్ సాహెబ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మూలంగా దేశంలో సరళీకరణ విధానాలు అమలు చేయడంతో స్వేచ్ఛ మార్కెట్ పేరుతో దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు పెట్టుబడుదారులు, పాలక ప్రభుత్వాలు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ చార్జీలు, నిత్యవసర సరుకులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆహార ధాన్యాలను పెట్టుబడిదారులు స్వేచ్ఛగా నిల్వలు చేసుకుని కృత్తిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పారు. ధరలను అదుపు చేయడంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. 2024 ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సిపిఎం కార్యాలయ భవన పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వరావు, నాయకులు ఓబులేసు, ఈశ్వరమ్మ, మద్దిలేటి, ఉస్మాన్, గోపాల్, ఆంజనేయులు, రంగమ్మ, నాగేశ్వరరావు, కర్ణ, సాజిదాబి, లింగస్వామి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టో : మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్










