Apr 24,2023 22:51

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు సోమవారం కలెక్టరేట్లో తమ చాంబర్లో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాధిత సింగ్‌, సివిల్‌ సప్లై, కోపరేటివ్‌, మార్కెటింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో ధాన్యం కొనుగోలులో రైతుల సమస్యలు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన 5.06 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఫిబ్రవరి 3 నాటికే పూర్తి చేసామన్నారు. ఇంకా రైతుల వద్ద ధాన్యం ఉన్న కారణంగా ప్రభుత్వం మరో 94 వేల మెట్రిక్‌ టన్నుల దాన్యం సేకరణ లక్ష్యం విధించగా, దానిని కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ఖరీఫ్‌ తర్వాత రైతులు చేపట్టిన అపరాల సాగు కారణంగా కుప్పలలో ఉన్న ధాన్యం డేటా సత్వరమే సేకరించాలని కలెక్టర్‌ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో వరికుప్పలు జియో కోఆర్డినేట్స్‌ ద్వారా డేటా సేకరించాలని, కుప్పలలో ఏ రకం ధాన్యం ఎంత ఉంది అనే వివరాలు కూడా సేకరించి వెంటనే తమకు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయభారతి, సివిల్‌ సప్లై డిఎం శ్రీధర్‌, డిఎస్‌ఓ పార్వతి, డి సి ఓ ఫణి కుమార్‌, ఏ డి మార్కెటింగ్‌ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.