- తహసిల్దార్ కార్యాలయం ఎదుట కెవిపిఎస్, వ్యకాస ధర్నా
ప్రజాశక్తి-తుగ్గలి : మండల కేంద్రమైన తుగ్గలి తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారము కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తుగ్గలిలో ఉన్న దళితులకు భూములు పంపిణీ చేయాలను కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గిత్తిరి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ అధ్యక్షులు శ్రీరాములు, కార్యదర్శి రంగరాజు మాట్లాడుతూ దళితులకు భూ పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా విపలం మైందన్నారు. నిరుపేద దళితులకు కనీసం సెంటు కూడా లేని దళితులకు తక్షణమే భూములను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఒక పక్క ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, చాలా గ్రామాలలో మాత్రం దళితులకు భూ పంపిణీ జరగలేదు అన్నారు. మండల కేంద్రమైన తుగ్గిలిలోని దళితులు చాలామంది ప్రభుత్వ భూ పంపిణీకి నోచుకోలేదన్నారు. అటువంటి వారిని గుర్తించి తక్షణమే భూ పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ కాలనీలో స్మశాన వాటిక లేకపోవడంతో ఎస్సీలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, వెంటనే తుగ్గలిలో స్మశాన వాటికను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితులకు కల్పించిన చట్టాలు ప్రభుత్వం కల్పించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దళితులకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరప్ప, బెన్ని,శివశంకర్, ఆంజనయ్య, దళిత మహిళలు పాల్గొన్నారు. అనంతరము తహసిల్దార్ రవికి వినతి పత్రం అందజేశారు.










