ఢిల్లీ : గూగుల్, రిలయన్స్ జియో సంయుక్తంగా వినాయకచవితిన ఆవిష్కరించాలనుకున్న అతితక్కువ ధర స్మార్ట్ఫోన్ (జియో ఫోన్ నెక్ట్స్) .. ఆవిష్కరణ వాయిదాపడింది. పరిశ్రమలో సెమీకండక్టర్ కొరత కారణంగా ఆవిష్కరణ తేదీని దీపావళికి మార్చింది. అయితే దాని ధరను మాత్రం ఇంతవరకూ వెల్లడించలేదు. పలు ప్రీమియం ఫీచర్లతో తక్కువ ధరతో రానున్న ఈ స్మార్ట్ఫోన్ను దీపావళి పండగ సీజను నాటికి విరివిగా అందరికీ అందుబాటులో ఉండేలా చూడటానికి చురుగ్గా పనిచేస్తున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. ఈ అదనపు సమయం వల్ల ప్రస్తుత అంతర్జాతీయ సెమీకండక్టర్ కొరత సైతం తగ్గేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. తాజాగా జియో ఓ ప్రకటనలో స్పందిస్తూ... 'అందరూ ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్స్ట్ను తీసుకొచ్చే విషయంలో మెరుగైన ప్రగతినే సాధించాం. ఇరు కంపెనీలు కలిసి సంయుక్తంగా ఈ 'మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్ఫోన్ను డిజైన్ చేశాం' అని పేర్కొంది.










