న్యూఢిల్లీ : తన ఓవర్సీస్ సిటిజెన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఒసిఐ) కార్డు రద్దు ఉత్తర్వులను సవాలు చేస్తూ విద్యావేత్త అశోక్ స్వెయిన్ వేసిన పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. నాలుగు వారాల్లోగా ఈ పిటిషన్ పై స్పందించాలని జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ కేంద్రాన్ని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 9కి జాబితా చేశారు.
అశోక్ స్వెయిన్ స్వీడెన్‌లోని ఉప్సలా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్వెయిన్ ఒసిఐ కార్డును రద్దు చేయడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒసిఐని రద్దు చేయగా.. కేంద్రం ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. జులై 30న రెండోసారి స్వెయిన్ ఒసిఐ కార్డును రద్దు చేసింది. తాను భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గన్నారని ఆరోపించినట్లు స్వెయిన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై వాదించడానికి నిర్దిష్ట సందర్భాలు లేదా ప్రకటనలను సూచించలేదని పేర్కొన్నారు. తాను విద్యావేత్తనని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లినా తన వ్యాఖ్యలను టార్గెట్ చేయకూడదని వ్యాఖ్యానించారు.
కాగా, తన తల్లి భారత్‌లో నివసిస్తున్నారని, గత మూడేళ్లుగా ఆమెను చూడలేకపోయానని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి అవసరమైన చికిత్స అందేలా చూసేందుకు తనకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.










