దశాబ్దాల కల నెరవేరబోతోంది
బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి
22న పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం
ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్
బందరుపోర్టుతో కృష్ణాజిల్లా వాసుల దశ, దిశ మారనుందని, దశాబ్దాల కల నెరవేరబోతోందని బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 22న ఎలాంటి విమర్శలకు తావు లేకుండా, విలువలతో కూడిన బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. మహానగరాలైన చెన్నై, ముంబై, విశాఖపట్నం అభివృద్ధి కారణం అక్కడ నెలకొల్పిన పోర్టుల ద్వారానే జరిగిందన్నారు. గతంలో నెల్లూరు కూడా మచిలీపట్నంలా ఉండేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయంతో కృష్ణపట్నం పోర్ట్ నిర్మాణం జరిగాక నెల్లూరు చరిత్ర మారిందన్నారు. రెండేళ్ళలో మచిలీపట్నం చరిత్ర మారబోతోందన్నారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు, పర్యావరణ అనుమతుల విషయంలో తన వంతు బాధ్యతలను నిర్వర్తించానని తెలిపారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.4000 కోట్ల నిధులు మంజూరు చేయించటంతో పాటు కేంద్రంతో మాట్లాడి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే పోర్టు పనుల నిమిత్తం రూ.500 కోట్లు రిలీజ్ అయినట్టు వెల్లడించారు. రైల్వే కనెక్టివీటి కోసం మచిలీపట్నం, రేపల్లె కొత్త రైల్వే లైను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రూ.700 కోట్లతో అమలు చేస్తే దివిసీమ ప్రజల కోరిక నెరవేరుతుందని, ప్రయత్నం చేద్దామని ముఖ్యమంత్రి చెప్పారని ఎంపీ తెలిపారు. దీంతో పోర్టు, రైల్వేలైన్, 6 లైన్ల రోడ్లు, దివిసీమతో అనుసంధానం, యువత, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగి జిల్లా దశ, దిశ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.










