పుట్టపర్తి అర్బన్ : శ్రీ సత్యసాయి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ మాధవరెడ్డి, కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణ (నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలు, ఎన్డీపిఎస్)పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ సంస్కతి ఇప్పుడిప్పుడే మొదలవుతోందని, ఇది మరింత విస్తృతం కాకుండా ఆదిలోనే అరికట్టాలన్నారు. జిల్లాలోని కదిరి ప్రాంతంలో డ్రగ్స్ కేసులు వస్తున్నాయని, ఈ ప్రాంతంలో డ్రగ్స్ వినియోగంపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. పరిశ్రమల ప్రాంతాల్లో డ్రగ్స్ వాడకంపై నిఘా పెట్టాలన్నారు. సరిహద్దులు, పరిశ్రమల ప్రాంతాల్లో నాకాబందీ పెట్టాలన్నారు. డ్రగ్స్ సరఫరా మూలాలు ఎక్కడున్నాయి అనేది కనిపెట్టి, ఆ మూలాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోకి డ్రగ్స్ ప్రవేశించకుండా చేపడుతున్న చర్యలను మరింత విస్తృతంగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, అడిషినల్ ఎస్పీ విష్ణు, ఆర్డీవోలు భాగ్యరేఖ, తిప్పేనాయక్, రాఘవేంద్ర, బిసి వెల్ఫేర్ శాఖ అధికారి నిర్మలా జ్యోతి, డిటిడబ్ల్యువో మోహన్ రామ్, ఎఫ్‌ఆర్‌ఒ వేణుగోపాల్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ గోవింద్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ అనుపమ, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.










