Apr 10,2022 13:11

చిత్రం : జేమ్స్‌
నటీనటులు: పునీత్‌ రాజ్‌కుమార్‌, డాక్టర్‌ శివ రాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, ప్రియా ఆనంద్‌, శ్రీకాంత్‌, శరత్‌ కుమార్‌, ముఖేష్‌ రిషి, అను ప్రభాకర్‌, ఆదిత్య మీనన్‌ తదితరులు..
దర్శకత్వం : చేతన్‌ కుమార్‌
నిర్మాతలు: కిషోర్‌ పత్తికొండ
సంగీత దర్శకుడు: చరణ్‌ రాజ్‌
సినిమాటోగ్రఫీ: స్వామి జె. గౌడ
ఎడిటర్‌ : దీపు ఎస్‌. కుమార్‌
బ్యానర్‌: కిశోర్‌ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ : మార్చ్‌ 17, 2022

 

డ్రగ్‌ మాఫియా కథే 'జేమ్స్‌'



కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం 'జేమ్స్‌'. ఆయన మరణానంతరం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆర్మీ, మాఫియా కథాంశాలతో ఇదివరకే అనేక చిత్రాలు వచ్చినప్పటికీ, 'జేమ్స్‌'ని ఓ కొత్త కోణంలో ఆవిష్కరించారు దర్శకులు చేతన్‌కుమార్‌. యాక్షన్‌, మానవ సంబంధాలతో కూడిన కథకు డ్రగ్‌ మాఫియాపై పోరాడే ఆర్మీ మేజర్‌గా పునీత్‌ను చూపించారు. దీంతో విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అసలు 'జేమ్స్‌' కథ ఏంటి? పునీత్‌రాజ్‌కుమార్‌ ఎలా నటించారు? వంటి విషయాలు తెలుసుకుందాం..!

కథలోకి వెళ్తే.. బెంగళూరు కేంద్రంగా డ్రగ్‌ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో కథ నడుస్తుంది. రెండు ప్రధానమైన అండర్‌ వరల్డ్‌ మాఫియా గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపులు నడిపేవాళ్లలో కీలకమైన వాడు విజరు గైక్వాడ్‌(శ్రీకాంత్‌). ప్రత్యర్థుల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా వేరే గ్రూపు వల్ల తన లైఫ్‌ రిస్క్‌లో పడిందని తెలుసుకుంటాడు. అప్పటికే అతని తండ్రిని చంపేస్తారు ప్రత్యర్ధులు. ముఖ్యంగా విజరు గైక్వాడ్‌ చెల్లెలు నిషా (ప్రియా ఆనంద్‌)ని టార్గెట్‌ చేస్తారనే భయం ఉంటుంది. దీంతో ప్రైవేట్‌ సెక్యూరిటీని నియమించుకోవాలని అనుకుంటాడు. అయితే సంతోష్‌ కుమార్‌ (పునీత్‌ రాజ్‌ కుమార్‌) సెక్యూరిటీ ఏజెన్సీ రన్‌ చేస్తూంటాడు. ఎలాంటి రిస్క్‌ అయినా తీసుకుని తను సెక్యూరిటీ ఇచ్చేవాళ్లను రక్షిస్తూంటాడు. ఈ క్రమంలో విజరు గైక్వాడ్‌ తనకు, తన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇచ్చే భాధ్యతను అప్పజెప్తాడు. ఈ క్రమంలో సంతోష్‌ రంగంలోకి దిగి దడదడలాడిస్తాడు. ప్రత్యర్థులకు చెందిన వాళ్లని అంతం చేస్తాడు. ఇది చూసిన విజరు గైక్వాడ్‌ తన చెల్లికి సరైన జోడీ సంతోష్‌ అని భావించి ఎంగేజ్మెంట్‌ పెడతాడు. కానీ అదే సమయంలో విజరుకు సంతోష్‌ గురించిన ఓ షాకింగ్‌ నిజం తెలుస్తుంది. కావాలనే తన కుటుంబానికి దగ్గరయ్యాడని అర్థమవుతుంది. ఊహించని రీతిలో అదే విజరుని, తన చెల్లెలు నిషాని కిడ్నాప్‌ చేస్తాడు. అలా చేసినప్పుడు తాను ''జేమ్స్‌'' అని రివీల్‌ చేస్తాడు. అసలు ఈ జేమ్స్‌ ఎవరు? వాళ్లనే ఎందుకు మరో పేరున్న వ్యక్తిలా వచ్చి కిడ్నాప్‌ చేశాడు? తన బ్యాక్‌ స్టోరీ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలే

మిగిలిన చిత్రం..
మాఫియా నేపథ్యంలో మొదలయ్యే ఈ సినిమాలోని ఆరంభ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మాఫియా సామ్రాజ్యం కోణంలో కథ మొదలయ్యే తీరు నేరుగా ప్రేక్షకుడిని లీనం చేస్తుంది. ఆర్మీ ఆఫీసర్‌ గెటప్‌తో పునీత్‌ రాజ్‌కుమార్‌ స్టైలిష్‌గా తెరపై దర్శనమిస్తాడు. మాఫియా డాన్‌కు ముప్పు ఉందనే కారణంగా సంతోష్‌ కుమార్‌ అతడికి సెక్యూరిటీగా బాధ్యతలు చేపట్టి, డ్రగ్స్‌ మాఫియా కార్యకలాపాలను కొనసాగించే ముఠాను ఏరిపారేస్తుంటాడు..
    ఇక జేమ్స్‌గా కనిపించే సెకండాఫ్‌ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే భావోద్వేగమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కుదిపేస్తుంది. ఫీల్‌గుడ్‌ అంశాలతో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అప్పటి వరకూ యాక్షన్‌ సినిమాగా అనిపించిన జేమ్స్‌ చిత్రం ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌తో ఎమోషనల్‌ డ్రామాగా మారిపోతుంది. దర్శకుడు చేతన్‌ కుమార్‌ రాసుకొన్న పాయింట్‌ హై ఎమోషనల్‌గా ఉంటుంది. అనాథలైన ఐదుగురు స్నేహితులకు సంబంధించిన కథకు ఆర్మీ బ్యాక్‌ డ్రాప్‌ను జతచేసి మరింత ఇంటెన్స్‌గా మార్చాడు. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్లను డిజైన్‌ చేసిన విధానం మాస్‌ ఆడియెన్స్‌కు మంచి కిక్‌ అందిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో ఎమోషనల్‌ సీన్లు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ఓవరాల్‌గా వెండితెర మీద పునీత్‌ రాజ్‌కుమార్‌ వన్‌ మ్యాన్‌ షోను దర్శకుడు నడిపించిన తీరు అందర్ని ఆకట్టుకొంటుంది.
    పునీత్‌ రాజ్‌కుమార్‌ నటన, ఫైట్స్‌, డ్యాన్సుల గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. మూడు రకాల వేరియేషన్‌ ఉన్న పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు. కథకు కీలకంగా మారిన అతిథి పాత్రలో శివరాజ్‌ కుమార్‌ మెరిశారు. మాఫియా డాన్లుగా శ్రీకాంత్‌, శరత్‌ కుమార్‌, ఆదిత్య మీనన్‌, ముఖేష్‌ రుషి నటించారు. పునీత్‌ ప్రియురాలు నిషాగా ప్రియా ఆనంద్‌ నటించింది. అయితే ఈ పాత్రలన్నీ కథ పరిధికి తగినట్టే ఉన్నాయి.
    టెక్నికల్‌ అంశాలకు వస్తే.. స్వామీ జే గౌడ అందించిన సినిమాటోగ్రఫి మరో అదనపు ఆకర్షణ. ఆర్మీ ఎపిసోడ్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా మంచుకొండల్లో తీసిన యాక్షన్‌ సీన్లు మాస్‌ ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్లను డిజైన్‌ చేసిన తీరును అభినందించాలి. చరణ్‌రాజ్‌ అందించిన మ్యూజిక్‌ సినిమాకు మరింత బలంగా మారింది. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అదరగొట్టింది. దీపు ఎస్‌ కుమార్‌ ఎడిటింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంది.