Apr 16,2023 22:43

matladutuna y.narasimharao

డప్పు కళాకారుల సమస్యలపై పోరాటం
నిమ్మాది ఏడుకొండలు సంస్మరణ సభలో వై.నరసింహారావు
ప్రజాశక్తి-ఉయ్యూరు
జిల్లాలోని డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇప్పించేంతవరకూ అవిశ్రాంతంగా నిమ్మాది ఏడుకొండలు పోరాడారని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు కొనియాడారు. ఆదర్శ కమ్యూనిస్టు, డప్పు కళాకారుల సంఘం నాయకుడు కీర్తిశేషులు నిమ్మాది ఏడుకొండలు సంస్మరణ సభ ఉయ్యూరు దళితవాడలోని ఆయన ఇంటి ఆవరణలో ఆదివారం జరిగింది. సిపిఎం ఉయ్యూరు పట్టణ కార్యదర్శి బి.రాజేష్‌ అధ్యక్షతన జరిగిన సభలో వై.నరసింహారావు మాట్లాడారు. ఎలాంటి ఆదరణలేని జిల్లాలో పేద డప్పు కళాకారుల సమస్యలపై నిరంతరం అనేక మండలాల్లో పర్యటించి వారి సమస్యలపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించారన్నారు. వందలాది మంది పేద డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరయ్యేలా కృషిచేశారన్నారు. తద్వారా వారికి పింఛన్లు సైతం మంజూరయ్యాయన్నారు. వారి సమస్యలపై నికరంగా నిలబడి పనిచేశారన్నారు. సమాజంలో నేటికీ ఇంకా పేదరికంలోనే మగ్గుతున్న చర్మకారుల సమస్యలను గుర్తించి వాటిపై ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతుగా కృషిచేశారన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా కూడా ఆందోళనలు చేపట్టారన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రాజేష్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాలైన దళితులపై జరుగుతున్న హత్యలు, దాడులు, కుల వివక్షతకు వ్యతిరేకంగా నిమ్మాది ఏడుకొండలు ఆందోళనలు నిర్వహించారని గుర్తుచేశారు. దళితుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేసేవారన్నారు. భవన నిర్మాణ రంగం కార్మికుల సమస్యలపైన కూడా పోరాటాలు చేశారన్నారు. వారికి కూడా గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా కృషిచేశారన్నారు. సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోసూరి శివ నాగేంద్రం మాట్లాడుతూ ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ పథకాలు వచ్చే విధంగా తోడ్పాటును అందించారన్నారు. సోషలిజం ద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందనే ఆశయానికి కట్టుబడి తుదిశ్వాస విడిచే వరకూ ఎండ్రజెండా నీడలోనే ఉన్నారన్నారు. ఆయన బాటలోనే కొండా సతీమణి, కుమార్తెలు పార్టీ రాష్ట్ర, జిల్లా మండల కమిటీల పిలుపుమేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. కుమారుడు గోపాల్‌ జిల్లా కెవిపిఎస్‌ బాధ్యతలు చేపట్టారన్నారు. చిన్న వయసులోనే క్యాన్సర్‌ మహమ్మారి సోకినా అధైర్య పడకుండా తన కుటుంబానికి ధైర్యం చెప్తూ చివరకు కొండా చనిపోవటం ఉయ్యూరు ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి వీరమాచనేని జ్యోతి మాట్లాడుతూ నిమ్మాది కొండా స్ఫూర్తితో రాబోయేకాలంలో పోరాటాలు చేస్తామన్నారు. నిమ్మాది కొండలు స్మారక స్థూపం దగ్గర వై.నరసింహారావు పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏడుకొండలు చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు కంభం కొండబాబు, ప్రభుదాసు, సిఐటియు జిల్లా నాయకులు ఒడుగు గంగాధర్‌ ప్రసాద్‌, సజ్జా బాలగంగాధర్‌ తిలక్‌, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి బి.కీర్తి, భవన నిర్మాణ సంఘం నాయకులు ఇస్మాయిల్‌, సిపిఎం తోట్లవల్లూరు మండల కార్యదర్శి శీలం ప్రకాశరావు, కంకిపాడు మండల కార్యదర్శి తాడంకి నరేష్‌, సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.