Oct 11,2023 21:53

డోలీపై వృద్ధుడిని వైద్యశిబిరాన్ని తీసుకొస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి - సాలూరు : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి డోలీ మోతలో గిరిజన రోగిని తీసుకొచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సీదరపు పెద రాజయ్య అనే వృద్దుడ్ని డోలీ మోతలో గిరిజనులు తీసుకొచ్చారు. ఐదుగురు గిరిజన గర్భిణులు 8 కిలోమీటర్ల దూరం నడుచుకొని వైద్య శిబిరం వద్దకు చేరుకున్నారు. మండలంలోని జిల్లేడువలస సచివాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసి వైద్య శిబిరానికి సమీపంలో ఉన్న ఏడు గిరిశిఖర గ్రామాల నుంచి గిరిజనులు హాజరయ్యారు. వారంతా కాలినడకన రాళ్లూ, రప్పలు దాటుకుంటూ కొండలపై నుంచి కిందకు వచ్చారు. నారింజపాడు, బొడ్డపాడు, కొండవలస, బెల్లపాక, బి.కొత్తూరు, కె.కొత్తవలస గ్రామాల నుంచి 150మంది గిరిజనులు కాలినడకన హాజరయ్యారు. ఒకవైపు ప్రభుత్వం ప్రజల ఇళ్ల వద్దకే వైద్య సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తీరు గిరిశిఖర గ్రామాల ప్రజలను వెక్కిరిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయినా గిరిశిఖర గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం లేని పరిస్థితి ఏర్పడింది. సచివాలయానికి వివిధ పనుల కోసం రావాలన్నా వీరంతా కాలికి బుద్ధి చెప్పాల్సిందే. ఈ గ్రామాలను కలుపుతూ బిటి రోడ్డు నిర్మించాలని గిరిజనులు అనేక సార్లు కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాలేదు. నవరత్నాలనే సంక్షేమ పథకాలతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపామని చెప్పుకొనే పాలకుల మాటలు నీటి మూటలు గానే మిగులుతున్నాయి. ఇప్పటికే నారింజపాడు నుంచి జిల్లేడువలసకు నాలుగు కిలోమీటర్ల దూరం వరకు రూ.3లక్షలు సొంత డబ్బుతో గిరిజనులు మట్టిరోడ్లు నిర్మించుకున్నారు. నారింజపాడుకు చెందిన 56గిరిజన కుటుంబాలు తలా రూ.6వేలు ఎత్తుకుని రోడ్డు నిర్మాణం చేపట్టారు. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలకు బిసి రోడ్లు నిర్మాణానికి మంజూరైన నిధులు చాలవని, మట్టిరోడ్లు నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ మేరకు వైద్య శిబిరం వద్దకు హాజరైన వైసిపి ఎంపిటిసి సభ్యులు గెమ్మెల సుబ్బారావును గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సీదరపు అప్పారావు కోరారు. సంక్షేమ పథకాల పేరుతో ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా గిరిజన గ్రామాలకు ప్రయోజనం లేదని, రహదారి, విద్యుత్‌, తాగునీరు సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచిదని అప్పారావు అధికారులతో చెప్పారు.