ప్రజాశక్తి, గుమ్మలక్ష్మీపురం : ఈ చిత్రాన్ని చూశారా? ఇదేదో దమ్ముమడిలో వాహనాలు వెళ్తున్నాయని అనుకుంటున్నారా? లేక ఏదో మారుమూల గ్రామానికి వెళ్లే రహదారి అనుకుంటున్నారా? అలా అనుకుంటే బురదలో కాలేసినట్టే!. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి ప్రధాన రహదారి దుస్థితి ఇది. వర్షం పడిందంటే చాలు.. గోతుల్లో నీరు చేరి చెరువును తలపిస్తోంది. ఏడాది కిందట తోటపల్లి ప్రధాన రహదారి నుంచి కురుపాం వరకు రూ.32 కోట్లతో 14 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు ప్రారంభించారు. నిధులు చాలని కారణంగా పెదమేరంగి, సీమనాయుడు వలస కూడలి, కురుపాంలో రహదారి పనులు చేపట్టలేదు. దీంతో వర్షాల సమయంలో గుంతల్లో నీరు చేరి వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. భారీ వాహనాలు వెళ్లే సమయంలో ద్విచక్రవాహనదారులు ఆగి వెళ్లాల్సిందే. లేకుంటే అంతే సంగతి. అధికారులు స్పందించి రహదారి పనులు పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.










