Sep 14,2023 21:07

మాట్లాడుతున్న ఆనంద్‌ బాబు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
దేశవ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని దళితులను చైతన్యం చేయడంలో భాగంగా కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో 'దళిత రక్షణ యాత్ర' నిర్వహిస్తున్నట్లు కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్‌బాబు తెలిపారు. గురువారం పట్టణంలోని ఎంబి చర్చి వెనుక ఉన్న ఎస్సీ కాలనీ నుంచి పాదయాత్ర నిర్వహించారు. కెవిపిఎస్‌ పట్టణ కార్యదర్శి సుమాల ఆంథోని అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌ బాబు, కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి.కరుణాకర్‌, జిల్లా సహాయ కార్యదర్శి మామిడికాయల రాజు, జిల్లా కమిటీ సభ్యులు సోగనూరు ఆనందరావు మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బిజెపి మత ఉన్మాదపు విధానాలతో మనువాదాన్ని తిరగతోడి దళితులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. అభివృద్ధి మాటను పక్కన పెట్టిన బిజెపి, కులం, మతం, సాంప్రదాయం, తినే తిండి పేరుతో వైషమ్యాలను సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు ఓట్లకు తప్ప దేనికీ పనికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆధిపత్య వర్గాల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని, వారిని కనీసం పోలీసు స్టేషన్‌ మెట్లు కూడా ఎక్కనీయకుండా అధికార మదంతో అండగా నిలుస్తోందని మండిపడ్డారు. పెరిగిపోతున్న ఈ ఆర్థిక, సామాజిక అంతరాలను బద్దలు కొట్టే విధంగా దళితులంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈనెల 29న విజయవాడలో జరిగే మహా ధర్నా ద్వారా దళితుల శక్తి ఏమిటో చూపాలని కోరారు. కెవిపిఎస్‌ మండల నాయకులు రాజా రమేష్‌, పట్టణ అధ్యక్షులు గుంటెప్ప, చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు సుమాల రాజు, కాలేబు, కాటికాపరి గుంతలు తీసే బేగరుల సంఘం నాయకులు పూజారి నాగప్ప, కెవిపిఎస్‌ పట్టణ నాయకులు చిన్న, మహేష్‌, మోహన్‌, సురేష్‌, దుబ్బ బాల పాల్గొన్నారు.