ప్రజాశక్తి-ఆలూరు
దళితుల ఆత్మగౌరవం, ఉపాధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, కాటికాపరులు, డప్పు, చర్మకారుల హక్కుల కోసం, రక్షణ కోసం కదిలి రావాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్ బాబు, వ్యకాస జిల్లా అధ్యక్షులు బి.వీరశేఖర్ కోరారు. శనివారం 'దళిత రక్షణ యాత్ర'లో భాగంగా ఆలూరుకు జీపు జాతా చేరుకుంది. జీపుజాతాకు స్థానిక కెవిపిఎస్ నాయకులు గోపాల్, రంగనాథ్ స్వాగతం పలికారు. అంబేద్కర్ సర్కిల్‌లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి 15 నిమిషాలకోసారి దళితులపై ఎక్కడో ఒకచోట కులవివక్షత, దాడులు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పోరాటాల తర్వాత వచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం రోజురోజుకు అపహాస్యం పాలవుతోందని తెలిపారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, మనువాద సంప్రదాయాలను రుద్ధి దళితులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. దళితులందరూ ఏకమై హక్కుల కోసం, బతుకు భద్రత కోసం ఉద్యమించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తూ 41 సిఆర్‌పిసి కింద ఇస్తున్న బేళ్లను రద్దు చేయాలని, కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సహాయాన్ని, పునరావాసాన్ని నిర్ణీత సమయంలో అందించాలని, జస్టిస్ పున్నయ్య సిఫార్సులను అమలు చేయాలని కోరారు. డప్పు, చర్మకారులకు రూ.5 వేల పింఛను పెంచాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డప్పు, గజ్జలు, డ్రెస్సు, చర్మకార కిట్లు వృత్తిదారులందరికీ ఇవ్వాలని, శ్మశానాల్లో వృత్తిని చేసే కాటికాపరులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి భృతి కల్పించాలని కోరారు. ఈనెల 29న చేపట్టే చలో విజయవాడలో వేలాది మంది హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎఐఎడబ్ల్యుయు నాయకులు బాలకృష్ణ, కృష్ణ, కెవిపిఎస్ నాయకులు రమేష్, విజయమ్మ, వీరేష్ పాల్గొన్నారు. ఆదోని (రూరల్) పట్టణానికి జీపుజాతా చేరుకుంది. కెవిపిఎస్, వ్యకాస నాయకులు, ఆటో యూనియన్ కార్యకర్తలు స్వాగతం పలికారు. తిమ్మారెడ్డి బస్టాండ్ ఆవరణలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న అధ్యక్షతన జరిగిన సభలో ఆనంద్ బాబు, వీరశేఖర్ మాట్లాడారు. పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ చట్టాలను నిర్వీర్యం చేసి రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్లను కూడా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ, రామాంజనేయులు, కెవిపిఎస్ జిల్లా నాయకులు కరుణాకర్, విజయమ్మ, కెవిపిఎస్ పట్టణ సీనియర్ నాయకులు విజరు, పట్టణ అధ్యక్షులు నాగేంద్ర పాల్గొన్నారు. దేవనకొండకు జీపు జాతా వచ్చిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అశోక్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఆనంద్ బాబు, వీరశేఖర్ మాట్లాడారు. దళితుల ఆర్థిక ప్రగతి, ఆత్మగౌరవం కోసం రెండెకరాల భూమి ఇవ్వాలని, ప్రయివేట్ రంగంలోనూ, పదోన్నతిలోను రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కెవిపిఎస్, వ్యకాస జిల్లా నాయకులు కరుణాకర్, రమేష్, విజయమ్మ, సురేంద్ర, మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ బాష, మండల అధ్యక్షులు నాగేష్, పాండు, రాయుడు, బలరాముడు, బండ్లయ్య, మహేంద్ర, రాముడు పాల్గొన్నారు. ఆస్పరికి జీపు జాతా చేరుకుంది. వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ అధ్యక్షత వహించారు. వ్యకాస జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు విజయమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, కరుణాకర్, ఆటో యూనియన్ నాయకులు మహనంది పాల్గొన్నారు.










