ప్రజాశక్తి - గోనెగండ్ల
దళితులపై జరుగుతున్న దాష్టికాలకు, దళితుల సంక్షేమం పట్టని పాలకులకు వ్యతిరేకంగా, అంటరానితనంపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా దళిత రక్షణ కోసం యాత్రను నిర్వహించి, సెప్టెంబర్ చివరిలో వేలాదిమందితో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కెవిపిఎస్ నాయకులు తెలిపారు. బుధవారం గోనెగండ్ల ఎంపిడిఒ కార్యాలయ సమావేశ భవనంలో సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఎస్.దేవసహాయం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్‌బాబు మాట్లాడారు. గ్రామగ్రామాన దళితవాడలను తట్టి లేపే విధంగా జిల్లా సబ్ జాతాలను, సదస్సులను నిర్వహిస్తామన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం, సాంఘిక హక్కుల కోసం జరిగే ఈ సామాజిక ఉద్యమంలో దళితులతో పాటు అభ్యుదయవాదులు, ప్రజాతంత్ర వాదులు పాల్గొనాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షులు డి.విజయమ్మ, ఎన్‌జి.కృష్ణ, బి.కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శులు ఆండ్ర గురు స్వామి, ఎం.భాస్కర్, మామిడికాయల రాజు, గిత్తరి రమేష్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న దేవ సహాయం










