Sep 07,2023 21:41

సిఐకు ఫిర్యాదు చేస్తున్న వైసిపి సర్పంచులు, ఎంపిటిసిలు

ప్రజాశక్తి-సాలూరు : డిప్యూటీ సిఎం రాజన్నదొర పేదల మనిషి, గిరిజన పక్షపాతి అని వైసిపి సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు చెప్పారు. గురువారం డిప్యూటీ సిఎం రాజన్నదొర నివాసంలో పాచిపెంట ఎంపిపి బి.ప్రమీల, సర్పంచులు నూకయ్య, కన్నంనాయుడు మాట్లాడారు. టిడిపి ఎస్‌టి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు దారూ నాయక్‌.. డిప్యూటీ సిఎం రాజన్నదొరపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆయన చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం రాజన్నదొర ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజన్నదొర మచ్చలేని నాయకుడిగా ప్రజల మన్ననలు పొందారని అన్నారు.
రూరల్‌ సిఐకి ఫిర్యాదు
టిడిపి ఎస్‌టి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు దారూ నాయక్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ వైసిపి గిరిజన సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. సిఐ ఎస్‌.ధనంజయరావుకు ఫిర్యాదు అందజేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన దారూ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మావుడి సర్పంచ్‌ పి.సుదర్శనరావు, తుండ సర్పంచ్‌ నూకయ్య, మరిపిల్లి ఎంపిటిసి సభ్యులు జన్ని సీతారాం, కందులపదం సర్పంచ్‌ కన్నం నాయుడు, తోణాం సర్పంచ్‌ మువ్వల ఆదియ్య, వైసిపి నాయకులు ఎన్‌.కళ్యాణ చక్రవర్తి ఉన్నారు.