డిపో సమస్యలను పరిష్కరిస్తాం
- ఎపి రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర చైర్మన్ మల్లికార్జునరెడ్డి
ప్రజాశక్తి - డోన్
డోన్ డిపోలో ఆర్టీసీ కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర చైర్మన్ ఏ.మల్లికార్జునరెడ్డి అన్నారు. ఆదివారం డోన్ డిపోను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. బస్టాండ్, డిపో గ్యారేజీలో టైర్ సెక్షన్, ఎలక్ట్రికల్ సెక్షన్, వాషింగ్ ప్లాంట్‌లను ఆయన పరిశీలించారు. డిపోలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ ఐవిఆర్.రెడ్డి డిపోకు సంబధించిన తిరుపతి సర్వీస్, నీటి కొళాయి సమస్య, గ్యారేజీలో వాషింగ్ ట్యాంక్, వాటర్ సంపుల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. చైర్మన్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డిపిటిఒ శ్రీనివాసులు, డోన్ డిపో మేనేజర్ ఎం.శశిభూషణ్, ట్రాఫిక్ మెకానికల్ సూపర్వైజర్లు, సిబ్బంది, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, ఎన్‌ఎంయు నాయకులు పాల్గొన్నారు.










